Okra Water | శరీర బరువును తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వ్యాయామం చేయడంతో పాటు ఆహార విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటారు. అలాగే బరువు తగ్గడానికి ఉపయోగపడే ఇతర ఆహారాలను కూడా తీసుకుంటూ ఉంటారు. బరువు తగ్గడానికి సహాయం చేసే ఇతర ఆహారాల్లో బెండకాయ నీరు కూడా ఒకటి. దీనిని ఓక్రా వాటర్ అని కూడా పిలుస్తారు. మనలో చాలా మంది ఈ పేరు వినే ఉంటారు. అలాగే ఈ నీటిని తీసుకునే వారు కూడా ఉన్నారు. అయితే ఈ నీటిని తీసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. బెండకాయ ముక్కలను నానబెట్టడం మొదలు, ఆ నీటిని సరైన మార్గంలో త్రాగడం, అలాగే ఈ నీటిని ఎంత మోతాదులో ఎప్పుడు తీసుకోవాలి అన్న విషయాలపై దృష్టి పెట్టడం కూడా చాలా అవసరమని నిపుణులు తెలియజేస్తున్నారు.
బెండకాయ నీటిని తాగడం వల్ల నిజంగా బరువు తగ్గుతారా.. అలాగే ఈ నీటిని ఎలా తయారు చేసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి, ఈ నీటిని తీసుకునే సరైన సమయం గురించి నిపుణులు ఏమంటున్నారో.. ఇప్పుడు తెలుసుకుందాం. బరువు తగ్గాలనుకునే వారు బెండకాయ నీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. బరువు తగ్గించే ముఖ్యమైన ఆహారాల్లో బెండకాయ నీరు ఒకటి అని చెప్పవచ్చు. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో ఇది ఎంతో సహాయపడుతుంది. బెండకాయలలో కరిగే ఫైబర్ ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల ఎక్కువ సమయం కడుపు నిండిన భావన కలుగుతుంది. వీటిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. దీంతో ఆకలి త్వరగా వేయకుండా ఉంటుంది. తద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
అలాగే ఈ నీళ్లలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. మెగ్నీషియం, ఫోలేట్, విటమిన్ సి వంటి పోషకాలు కూడా ఉంటాయి. కనుక ఈ నీటిని తీసుకోవడం వల్ల మనం ఆరోగ్యవంతంగా బరువు తగ్గవచ్చు. అంతేకాకుండా ఈ నీటిలో ఫాలీఫినాల్స్ ఉంటాయి. ఇవి నిల్వ చేసిన కొవ్వును సమర్థవంతంగా విచ్చినం చేయడంలో సహాయపడతాయి. ఈ విధంగా బెండకాయ నీరు బరువు తగ్గాలనుకునే వారికి ఎంతో దోహదపతుందని చెప్పవచ్చు. అలాగే చాలా మంది బెండకాయ ముక్కలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగుతూ ఉంటారు. అయితే అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ ప్రకారం భోజనానికి ముందు ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల మనం క్యాలరీలను తీసుకోవడం గణనీయంగా తగ్గించవచ్చు. కనుక బెండకాయ నీటిని అల్పాహారానికి 30 నిమిషాల ముందు తీసుకోవడం మంచిది అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అల్పాహారానికి అరగంట ముందు ఈ నీటిని తాగడం వల్ల ఆకలి అణచివేయబడుతుంది. అతిగా తినడం తగ్గుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అంతేకాకుండా భోజనానికి ముందు బెండకాయ నీరు వంటి అధిక ఫైబర్ ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల 18 శాతం ఎక్కువ బరువు తగ్గుతారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక ఈ నీటిని సరైన మార్గంలో తయారు చేయడం కూడా అవసరం. ఈ నీటిని తయారు చేసుకోవడానికి గాను ముందుగా ఒక గ్లాస్ నీటిని తీసుకోవాలి. తరువాత 4 లేదా 5 తాజా బెండకాయలను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం పూట ఈ నీటిని బాగా కలిపి అల్పాహారానికి అరగంట ముందు పరగడుపున తాగాలి. ఈ నీటిలో రుచి కోసం నిమ్మరసాన్ని కూడా కలిపి తీసుకోవచ్చు.
బెండకాయ నీరు ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ దీనిని ఒక గ్లాస్ కంటే ఎక్కువగా తీసుకోకూడదు. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కనుక అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడే వారు ఈ నీటిని తీసుకోకపోవడమే మంచిది అని చెప్పవచ్చు. ఈ నీటిలో రాళ్ల తయారీని ప్రోత్సహించే ఆక్సలేట్లు ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు వ్యాయామం, సమతుల్య ఆహారంతో బెండకాయ నీటిని తీసుకోవడం వల్ల గణనీయంగా బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు.