Telangana | హైదరాబాద్, జనవరి 28(నమస్తే తెలంగాణ): ‘తన సొమ్ము కాకుంటే ఎంతైనా ఖర్చుచేస్తారు’ అనే తరహాలోనే ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం తీరు. పది రూపాయల పనికి వంద రూపాయలు ఖర్చుచేస్తున్నారు. మంత్రుల విలాసాలకు విచ్చలవిడిగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. చిన్నాచితకా పనులకు కూడా లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్నారు. అంతేకాదు, మంత్రుల నివాస క్వార్టర్ల మరమ్మతులకు ప్రభుత్వం చేస్తున్న ఖర్చు మార్కెట్ ధరలతో పొంతన లేకుండా ఉన్నది. మంత్రి క్వార్టర్లో ఏసీ కోసం దాదాపు లక్ష రూపాయలు, పార్కింగ్ ఏరియాలో సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ.4.80 లక్షలు ఖర్చుచేయడమే ఇందుకు నిదర్శనం. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ వచ్చినప్పటినుంచి ప్రజాధనాన్ని ఇష్టారాజ్యంగా ఖర్చుచేస్తున్నారు. ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు విడుదల కావాలంటే ఏదో ఒక పని చేసినట్టో, ఏదైనా వస్తువు కొనుగోలు చేసినట్టో రికార్డులు ఉండాలి. సంబంధిత శాఖకు చెందిన అధికారి పంపే ప్రతిపాదనల ఆధారంగా తొలుత అనుమతులు, ఆ తరువాత నిధులు విడుదల చేస్తారు. ఇది సహజంగా జరిగే ప్రక్రియ.
అయితే, ప్రభుత్వంలోని పెద్దల అండదండలుంటే పనులపై ఎటువంటి నిఘా ఉండదు. పనులు జరిగినా, జరగకున్నా నిధులు విడుదలవుతాయి. ప్రస్తుతం ఆర్అండ్బీ శాఖలో ఇదే తంతు కొనసాగుతున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంత్రుల క్వార్టర్ల మరమ్మతు పనులకు ప్రభుత్వం విడుదలచేస్తున్న నిధులు చూస్తుంటే ఈ అరోపణలకు బలం చేకూరుతున్నది. ఒక్క బాత్రూమ్ మరమ్మతుకు రూ.76 లక్షలు, ఒక్కో ఏసీ కొనుగోలుకు రూ.95 వేలు, సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ.5 లక్షలు విడుదలచేయడం గమనార్హం. ఓ సామాన్యుడు ఇంటి నిర్మాణానికి చేస్తున్న ఖర్చుకన్నా ఎన్నోరెట్లు ఎక్కువ ఖర్చు మంత్రుల బాత్రూమ్ల మరమ్మతులకు ఖర్చుచేస్తుండటం విమర్శలకు తావిస్తున్నది. ఆర్‌అండ్‌బీలో ఎంపికచేసిన కొందరు కాంట్రాక్టర్లకు రొటేషన్ పద్ధతిలో పనులను ధారాదత్తం చేస్తున్నట్టు సమాచారం. మంత్రుల అనుచరులుగా ఉన్న కొందరు కాంట్రాక్టర్లకే పనులు దక్కుతున్నట్టు ఆరోపణలున్నాయి.
బుధవారం ప్రభుత్వం విడుదలచేసిన నిధులు
బంజారాహిల్స్ రోడ్ నంబర్-12లోని మంత్రుల నివాస సముదాయంలో క్వార్టర్ నంబర్-21లో రెండు ఏసీల ఏర్పాటు కోసం రూ.1.90 లక్షలు విడుదలచేస్తూ బుధవారం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్ ఉత్తర్వులు జారీచేశారు. మార్కెట్లో ఏసీల ధరలు రూ.20,000 నుంచి గరిష్ఠంగా రూ.70 వేల వరకు ఉన్నాయి. విండో ఏసీ ధర రూ.20 వేల నుంచి రూ.35వేల వరకు ఉండగా, స్లిట్ ఏసీ ధర రూ.30వేల నుంచి రూ.70 వేల వరకూ ఉన్నది. అయినా ప్రభుత్వం రెండు ఏసీలను సమకూర్చుకునేందుకు రూ.1.90 లక్షలు కేటాయించడం గమనార్హం. క్వార్టర్ నంబర్-7లో బాత్రూమ్లో వివిధ రకాల మరమ్మతు పనుల కోసం మరో రూ. 18 లక్షలు విడుదలచేశారు. 10/10 సైజులో విశాలమైన కొత్త బాత్రూమ్ నిర్మించినా రూ.5 లక్షల కన్నా ఎక్కువ ఖర్చు కాదని ఇంజినీర్లు చెప్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఏకంగా రూ.18 లక్షలు విడుదలచేసింది.