పక్కింటోడికి కష్టమొస్తేనే సంబంధం లేనట్లు వ్యవహరించే రోజులివి. కానీ, ఆ మహిళమాత్రం దేశంకాని దేశంలో వలసకూలీల అవస్థలు తెలుసుకుంది. ఏజెంట్ మోసానికి బలై ఖతార్‌లో తెలుగువాళ్లు పడే దీనావస్థలు చూసి చలించింది.వారి కడుపునింపి ఇంటికి సాగనంపుతున్నది నందిని అబ్బగౌని. ఉద్యోగం కోసం గల్ఫ్బాటపట్టిన ఆమె.. నేడు ఐసీసీ కల్చరల్ కోఆర్డినేటర్ స్థాయికి ఎదిగింది. సేవా కార్యక్రమాలను విస్తరించి నారీశక్తి పురస్కారాన్ని సైతం కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా గల్ఫ్ కార్మికుల గొంతుకైన ఈ తెలంగాణ బిడ్డను.. జిందగీ పలకరించింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే…
నేను పుట్టింది మేడ్చల్ జిల్లాలోని అలియాబాద్. పెరిగిందంతా హైదరాబాద్. నాన్న సిండికేట్ బ్యాంక్‌లో ఉద్యోగి. అమ్మ గృహిణిగా మా ఆలనాపాలనా చూసుకున్నది. ఎంబీఏ పూర్తి చేసిన నేను.. మజీద్‌పూర్‌కు చెందిన మా మేనబావ శ్రీధర్‌ను ప్రేమించి 2008లో పెళ్లి చేసుకున్నాను. ఉద్యోగరీత్యా ఆయన 2011లో ఖతార్‌కు వెళ్లగా, నేను 2013లో వెళ్లాను. అప్పటికే మాకిద్దరు అమ్మాయిలు. గతంలో హైదరాబాద్‌లో ఉద్యోగ అనుభవం ఉండటంతో ఖతార్‌లో కూడా ఆయనతోపాటు ఉద్యోగంలో చేరా. ఆఫీస్, ఇల్లు ఇవే ప్రపంచమని బతుకుతున్న నన్ను.. ఖతార్ పరిస్థితులు పూర్తిగా మార్చాయి. ఇక్కడి ఎండలను చూసి బెంబెలేత్తిపోయేదాన్ని. ఏసీలో కూర్చొని పనిచేసే మాకే అంత భయముంటే.. నిత్యం ఎండలోనే పనిచేసే కార్మికులను తలచుకుంటేనే గుండె తరుక్కుపోయేది. కానీ, అప్పుడు వాళ్లకోసం ఏమీ చేయలేని పరిస్థితి నాది.
ఆ రెండు సంఘటనలే..
ఒకరోజు ఆఫీస్‌కు వెళ్తున్నప్పుడు ఏజెంట్ల చేతిలో మోసపోయిన ఓ ముస్లిం యువతి కనిపించింది. ఆమె బాధను చూసి, వెంటనే ఆమెను ఖతార్‌లోని భారత రాయబార కార్యాలయానికి తీసుకెళ్లాను. ఆమెకు జరిగిన అన్యాయాన్ని అధికారులకు వివరించాను. వాళ్ల సహకారంతో ఆ అమ్మాయిని తిరిగి స్వదేశానికి పంపించాను. అది నా జీవితంలో ఎదురైన మొదటి అనుభవం. ఇక రెండో ఘటన మాత్రం.. నా జీవితాన్నే మార్చేసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన 21మంది యువకులు ఏజెంట్ల మోసానికి బలైపోయారు. ఎడారి దేశంలో పనిదొరక్క, ఇంటి నుంచి తెచ్చుకున్న డబ్బులు అయిపోవడంతో పస్తులుండటం.. నన్ను ఎంతగానో కలిచివేసింది. వాళ్లకు తిండిపెట్టి, ఒకనెల రూమ్ రెంట్ కట్టి తిరిగి వాళ్లను మన దేశానికి పంపించాను. ఇలాంటి బాధితులు చాలామంది ఉన్నారని అప్పుడే తెలుసుకున్నా. వాళ్లందరికీ నావంతు సహాయం చేసేందుకు నా జీతంలో పదిశాతం డబ్బులను కేటాయించడం మొదలుపెట్టా.
గుర్తుంచుకొని మరీ..
ప్రపంచాన్ని వణికించిన కరోనా సంక్షోభంలో ఎంతోమంది వలసకూలీలు ఇబ్బంది పడ్డ విషయం మనకు తెలిసిందే కదా. అప్పటికే తెలుగు రాష్ర్టాలనుంచి వచ్చిన వలసకార్మికులు ‘మేము సచ్చినా ఈ దేశంలో ఉండం. మా దేశానికి పంపించండి’ అంటూ అభ్యర్థనలు చేశారు. ముందుగా వృద్ధులు, రోగులు, గర్భిణులు, బాలింతలను అత్యవసరంగా పంపించేందుకు డేటా సిద్ధం చేసుకున్నాం. ఆ సమయంలోనే ఓ మహిళ నా వద్దకు వచ్చి.. ‘నేను సరోగసి ద్వారా బిడ్డకు జన్మనిచ్చాను. ఆ పాప ప్రస్తుతం భారత్‌లో ఉంది. ఆమెను వెంటనే చూడాలి. దయచేసి నన్ను పంపించండి’ అంటూ వేడుకుంది. తాను గర్భం దాల్చకపోయినా బిడ్డకోసం అధికారులను ఒప్పించి ఆమెను ఫ్లయిట్ ఎక్కించా. ఆవిడ ఇటీవల ఖతార్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమానికి తన బిడ్డతో వచ్చి నన్ను గుర్తుపట్టిమరీ కృతజ్ఞతలు చెప్పింది. సహాయం చేసిన నేను ఎప్పుడో మరిచిపోయా! కానీ, ఆమె మాత్రం గుర్తుపెట్టుకుంది. ఎంతో సంతోషం కలిగిన సంఘటన అది.

29
మన పండుగకు ప్రాణం..
ఖతార్‌లోని తెలుగువాళ్లలో ఏపీకి చెందినవాళ్లే ఎక్కువ ఉంటారు. నేను వచ్చిన కొత్తలో బతుకమ్మ పండక్కి, బతుకమ్మ ఆడుకునేందుకు ఆఫీస్నుంచి తొందరగా వెళ్తుంటే ఎగతాళి చేసేవాళ్లు. అప్పుడే అనుకున్నా.. విదేశాలకు కూడా మన సంస్కృతిని పరిచయం చేయాలని. ఈ దేశంలో ఏ కార్యక్రమం చేయాలన్నా ప్రభుత్వం అనుమతి పొందాలి. అప్పటికే మా ఆయన ఓ సంఘంలో సభ్యుడిగా ఉన్నందున.. వారి అధ్వర్యంలో బతుకమ్మ సంబురాలను ఖతార్‌లో తొలిసారి నిర్వహించా. ఆ తరువాత 2019లో కొంతమందిమి కలిశాం. ఇక అప్పటినుంచి పండుగలు-పబ్బాలన్నీ అధికారికంగా చేయడం ప్రారంభించాం. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వాళ్లు కూడా ఇందులో సభ్యులుగా చేరడం విశేషం. ఒకవైపు గల్ఫ్ కార్మికులకు చేయూతనిస్తూ, మరోవైపు తెలుగు సంస్కృతికి దోహదం చేస్తున్నందుకు.. నా సేవలను గుర్తించి భారత రాయబార కార్యాలయం 2024లో ఇండియన్ కల్చరల్ సెంటర్(ఐసీసీ)కి నన్ను నామినేట్ చేసింది. ఇక అప్పటినుంచి కల్చరల్ కోఆర్డినేటర్‌గా భారతదేశంలోని సంస్కృతీసంప్రదాయ వేడుకలకు ఖతార్‌ను వేదిక చేస్తున్నాను.
గర్వ పడతాను..
బతుకుదెరువుకోసం తెలుగు రాష్ర్టాలనుంచి వచ్చి పనిచేసే కార్మికుల్లో 90శాతం మంది బ్లూకాలర్ కార్మికులే. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒకేసారి 500 మంది గల్ఫ్ కార్మికులను విముక్తి చేసిన సమయంలో మా పాత్ర కూడా ఉంది. ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నానంటే కారణం.. నా భర్త సహకారం వల్లే. నారీశక్తి పురస్కారం నాలో మరింత బాధ్యతను పెంచింది. మహిళా సాధికారత దిశగా సాగుతూ, గల్ఫ్ కార్మికుల సమస్యలపై పనిచేయాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నాను. ఈ స్థాయిలో ఉన్నానంటే నా కుటుంబం, నేను పుట్టిపెరిగిన గడ్డే కారణమని గర్వంగా చెప్పుకొంటాను.
విదేశాల్లో ఉండే ఎన్ఆర్ఐలకు,ఖతార్‌లో నివసించే భారతీయులకు చాలా తేడా ఉంది. అమెరికా వంటి దేశాల్లో ఐదేళ్లపాటు అక్కడే పనిచేస్తే ఆ దేశపు గ్రీన్‌కార్డు ఇస్తారు. కానీ, ఖతార్‌లో మాత్రం ఎన్నేళ్లు ఉద్యోగం చేసినా పర్మినెంట్ వీసా ఉండదు. ఏడాదికోసారి రెన్యువల్ చేసుకోవాల్సిందే. పని ప్రదేశాల్లో మనవాళ్ల ప్రాణాలు పోయినా పట్టించుకోరు. మనదేశంలో ఉన్న స్విగ్గీలాంటి డెలివరీ సంస్థల్లో ఇక్కడ పనిచేసేందుకు భారత్‌నుంచి చాలామంది యువకులు వస్తుంటారు. వాళ్లంతా రోడ్డు ప్రమాదాల్లో మరణించడం చూసి చాలా బాధేస్తుంటుంది
-రాజు పిల్లనగోయిన