Jagga Reddy | సంగారెడ్డి, జనవరి 28 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీలో కీలకనేతగా పేరున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హెచ్చరికలను సొంత పార్టీ సీరియస్‌గా తీసుకోలేదు. సంగారెడ్డి నుంచి జిల్లా రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను తరలించొవద్దని, ఒకవేళ తరలిస్తే ఊరుకునేది లేదని జగ్గారెడ్డి మంగళవారం సొంత ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. డీఆర్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల తరలింపు కోసం పటాన్చెరు మండలం కర్దనూర్లో నిర్మించతలపెట్టిన ఇంటిగ్రేటెడ్ సబ్‌రిజిస్ట్రార్ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన కార్యక్రమాన్ని వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.
అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం జగ్గారెడ్డి హెచ్చరికలను పట్టించుకోలేదు. యథావిధిగా బుధవారం కర్దనూర్లో ఇంటిగ్రేటెడ్ సబ్‌రిజిస్ట్రార్ కాంప్లెక్స్‌కు మంత్రులు పొంగులేటి, గడ్డం వివేక్ శంకుస్థాపన చేశారు. కర్దనూర్లో కాంప్లెక్స్ భవనం పూర్తికాగానే సంగారెడ్డి నుంచి జిల్లా రిజిస్ట్రార్, సంగారెడ్డి, పటాన్చెరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను తరలించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. సంగారెడ్డి నుంచి రిజిస్ట్రార్ కార్యాలయాల తరలింపు వెంటనే ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షు డు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ డిమాండ్ చేశారు.
జగ్గారెడ్డి సైతం కార్యాలయాల తరలింపుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. జిల్లా నేతల హెచ్చరికలు, డిమాండ్లను పట్టించుకోకుండా బుధవారం మంత్రి పొంగులేటి కాంప్లెక్స్‌కు శంకుస్థాపన చేశారు. కాగా ఈ కార్యక్రమానికి జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ హాజరుకాలేదు. కాంగ్రెస్‌లో చేరిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సైతం బాయ్‌కాట్ చేశారు.
ఇంటిగ్రేటెడ్ సబ్‌రిజిస్ట్రార్ కాంప్లెక్స్‌ను ఎవరిని అడిగి పటాన్చెరు మండలం కర్దనూర్లో ఏర్పా టు చేస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంప్లెక్స్ నిర్మాణం విషయంలో కలెక్టర్, మంత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రాంతానికి కేవలం పటాన్చెరు సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసు మాత్రమే కావాలని తాము కోరినట్టు చెప్పారు.
ఇంటిగ్రేటెడ్ సబ్‌రిజిస్ట్రార్ కాంప్లెక్స్ నిర్మాణానికి అవసరమైన స్థలం కేటాయింపు సమయంలోనూ కలెక్టర్ తనను సంప్రదించలేదని అందుకే శంకుస్థాపన కార్యక్రమాన్ని బాయ్‌కాట్ చేసినట్టు తెలిపారు. కాగా, పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కాటా శ్రీనివాస్‌గౌడ్, కాంగ్రెస్ మరో ముఖ్యనేత నీలం మధు సైతం శంకుస్థాపనకు దూరంగా ఉన్నారు. అయితే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల తరలింపును జగ్గారెడ్డి వ్యతిరేకించగా.. ఆయన సతీమణి, నిర్మలా జగ్గారెడ్డి మాత్రం హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది.