Mumbai | ముంబై, జూలై 17: దేశంలో నిరుద్యోగ తీవ్రత ఏ స్థాయిలో ఉందో చాటే సంఘటన ముంబై ఎయిర్పోర్టులో జరిగింది. ఎయిర్పోర్టులో ప్రయాణికుల లగేజీని లోడింగ్, అన్లోడింగ్ చేయడం కోసం లోడర్ ఉద్యోగాలు, ఎయిర్పోర్టులో నిర్వహణ పనుల కోసం హెల్పర్ ఉద్యోగాల భర్తీకి ఎయిర్ ఇండియా ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ ప్రకటన జారీ చేసింది. జీతం రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు ఉంటుందని, ఆసక్తి గల అభ్యర్థులు మంగళవారం ముంబై ఎయిర్పోర్టు వద్ద ఉన్న తమ కార్యాలయానికి రావాలని పిలిచింది. దీంతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువకులు వేలాదిగా ఎయిర్పోర్టు వద్దకు పోటెత్తారు. దాదాపు 25 వేల మంది యువకులు అప్లికేషన్లు, సర్టిఫికెట్లు పట్టుకొని చేరుకున్నారు. గంటల తరబడి అభ్యర్థులు నీళ్లు, ఆహారం లేకుండా నిరీక్షించాల్సి వచ్చింది. చివరకు దరఖాస్తులు ఇచ్చేసి వెళ్లాలని సంస్థ ప్రకటించింది.
నిన్న గుజరాత్లో.. నేడు మహారాష్ట్రలో..
ఇటీవల గుజరాత్లోని భరూచ్ జిల్లాలోనూ 10 ఉద్యోగాల కోసం దాదాపు 1,800 మంది అభ్యర్థులు తరలిరావడంతో తోపులాట జరిగిన సంఘటన తెలిసిందే. ఈ ఘటనలు జరిగిన రెండు రాష్ర్టాల్లోనూ ఎన్డీఏ ప్రభుత్వాలే ఉండటం గమనార్హం.