West Asia | బీరుట్, అక్టోబర్ 6: పశ్చిమాసియాలో ఉద్రిక్తత మరింత పెరిగింది. అటు ఇజ్రాయెల్, ఇటు హెజ్బొల్లా, హమాస్‌లు ఎవరికి వారు వెనక్కి తగ్గకపోవడంతో దాడులు, ప్రతిదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఉత్తరగాజాలో ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 24 మంది మరణించారు. శనివారం ఇజ్రాయెల్ దళాలు తొలిసారిగా లెబనాన్‌లోని ట్రిపోలి నగరంపై దాడులు జరిపాయి. మరో పక్క ఇజ్రాయెల్‌పై దాడులు జరిపి ఏడాదైన సందర్భంగా గాజా నుంచి హమాస్ ఆదివారం ఇజ్రాయెల్‌పై రాకెట్ దాడులు చేసింది.
హెజ్బొల్లాకు మరోషాక్
హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా మృతితో గట్టి షాక్‌లో ఉన్న హెజ్బొల్లాకు మరో ఎదురుదెబ్బ తగిలినట్టు తెలిసింది. మరో కరుడుగట్టిన నేత, నస్రల్లా వారసుడు సఫీద్దీన్, ఇరాన్ కమాండర్ ఇస్మాయిల్ కూడా మరణించినట్టు ప్రచారం జరుగుతున్నది. హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా హత్య తర్వాత ఆయన వారసుడిగా హషేమ్ సఫీద్దీన్ బాధ్యతలు చేపడతారని విస్తృతంగా ప్రచారం జరిగింది. గురువారం దక్షిణ బీరుట్లో ఇజ్రాయెల్ జరిపిన మరో దాడిలో సఫీద్దీన్ మృతి చెందినట్టు వార్తలు వస్తున్నాయి.
ఉత్తర గాజాలో 24 మంది మృతి
ఉత్తర గాజాలో ఇజ్రాయెల్ వాయుసేన జరిపిన దాడిలో 24 మంది మృతి చెందారు. ఆదివారం ఒక మసీదు, స్కూల్ లక్ష్యంగా జరిపిన ఈ దాడిలో 24 మంది మృతి చెందగా, 93 మంది గాయపడ్డారు. కాగా, యుద్ధం కారణంగా గాజా స్ట్రిప్‌లో నిరాశ్రయులైన వారు ఇందులో తలదాచుకుంటున్నారని రాయిటర్స్ సంస్థ తెలిపింది.
ఇరాన్ ఖుద్స్ ఫోర్స్ కమాండర్ మృతి?
ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్(ఐఆర్జీసీ) ఖుడ్స్ ఫోర్స్ కమాండర్ ఇస్మాయిల్ ఘనీ జాడ కొన్ని రోజులుగా తెలియడం లేదు. శుక్రవారం బీరుట్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడి అనంతరం ఆయన కన్పించడం లేదని, బహుశా ఆ దాడిలో ఆయన మరణించి ఉండవచ్చునని కొన్ని టర్కీ, ఇజ్రాయెల్ వార్తా సంస్థలు వెల్లడించాయి. మరోవైపు ఇజ్రాయెల్ దాడిచేయొచ్చన్న భయాల నేపథ్యంలో ఇరాన్ తన గగనతలాన్ని మూసివేసింది.
జాడ లేని హమాస్ చీఫ్
ఇజ్రాయెల్ వరుసగా ఉగ్ర సంస్థల అగ్రనేతలను హతమారుస్తుండటంతో హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్‌కు భయం పట్టుకుంది. దీంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఎవరితోనైనా మాట్లాడితే ఎక్కడ తన ఆచూకీ కనిపెట్టేస్తారో అన్న భయంలో ఆయన ఖతారీ మధ్యవర్తులతో కనీసం ఫోన్లో కూడా మాట్లాడటం లేదని ఖతారీ అధికారులను ఉటంకిస్తూ ఎన్12 వార్తా సంస్థ తెలిపింది. ముందు జాగ్రత్త చర్యగా ఇజ్రాయెల్ బందీలను తన ప్రాణాలకు కవచంగా ఉంచుకున్నారని వెల్లడించింది.