న్యూఢిల్లీ, ఆగస్టు 25 : రెనో ఇండియా దేశీయ మార్కెట్లో సరికొత్త కైగర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. పాతదాంతో పోలిస్తే 35 కొత్త ఫీచర్స్‌తో తీర్చిదిద్దిన ఈ మాడల్ ఎక్స్టీరియర్, ఇంటీరియర్‌ను అడ్వాన్స్ టెక్నాలజీతో తీర్చిదిద్దింది. రెండు రకాల్లో లభించనున్న ఈ కారు కైగర్ టర్బో రూ.9,99,995 నుంచి రూ.11,29,995 లోపు లభించనుండగా, కైగర్ ఎనర్జీ రూ.6.29 లక్షల నుంచి రూ.9.14 లక్షల లోపు లభించనున్నది. ఈ ధరలు న్యూఢిల్లీ షోరూంనకు సంబంధించినవి.
గంటకు 100 కిలోమీటర్లు దూసుకుపోయే ఈ కారులో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, 20.32 ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, వైర్లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, 100 పీఎస్ టర్బో ఇంజిన్, 21 స్టాండర్డ్ భద్రత ఫీచర్లు, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ఫీచర్స్‌తో తీర్చిదిద్దింది. ఈ సందర్భంగా రెనో ఇండియా ఎండీ, సీఈవో వెంకట్రామ్ మామిళ్లపల్లి మాట్లాడుతూ.. దేశంలో అత్యధిక వృద్ధిని నమోదు చేసుకుంటున్న ఎస్యూవీ సెగ్మెంట్‌ను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ నయా మాడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు చెప్పారు. లీటర్ పెట్రోల్‌కు 20.38 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నది.