హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఆర్టీసీలో రిటైర్డ్ ఉద్యోగులు అరిగోస పడుతున్నారు. ఆర్టీసీ సంస్థ నిర్లక్ష్యంతో సకాలంలో బెనిఫిట్స్ అందక.. ఇప్పట్లో అవి రావేమోననే బెంగతో, అనారోగ్య సమస్యలతో తనువు చాలిస్తున్నారు. ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వ నిరంకుశ వైఖరి వల్ల దాదాపు 17 వేలమంది రిటైర్డ్ ఉద్యోగులు తమ బెనిఫిట్స్ కోసం ప్రతినెలా వేయి కండ్లతో ఎదురుచూస్తున్నారు. 17 వేల మందికి ప్రభుత్వం సుమారు రూ.2 వేల కోట్లవరకు బకాయి పడిందని, వాటిని ఇప్పించాలని కోరితే తమ గోస పట్టించుకోవడం లేదని.. అందుకే మంగళవారం ‘చలో బస్ భవన్’కు పిలుపునిచ్చామని తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పేర్కొన్నది. ఒక్కో రిటైర్డ్ ఉద్యోగికి సుమారు రూ.13 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు రావాల్సి ఉన్నదని చెప్తున్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయాలని రవాణాశాఖ మంత్రి, ఆర్టీసీ ఎండీలకు ఎన్నిసార్లు వినతిపత్రం ఇచ్చినా పట్టించుకోకపోవడంతో వృద్ధాప్యంలోనూ ఆందోళనలు చేయాల్సి వస్తున్నదని అంటున్నారు. ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు చేపట్టిన సమ్మెకు ఆర్టీసీ కార్మిక జేఏసీ నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని చైర్మన్ ఈదురు వెంకన్న తెలిపారు. నిరసనకు టీజేఎంయూ హనుమంతు ముదిరాజ్ సైతం మద్దతు తెలిపారు.
ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం తమ రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో సకాలంలో స్పందించకపోవడంతో ఎక్కడి బెనిఫిట్స్ అక్కడే ఆగిపోయాయని వాపోతున్నారు. కొన్నేండ్లుగా రిటైర్మెంట్ పెన్షన్ స్కీమ్ (ఆర్పీఎస్), 2017, 2021 ఏరియర్స్, లీవ్ ఎన్క్యాష్మెంట్లు, గ్రాట్యుటీ డిఫరెన్స్ డబ్బులు, ఆగిన లీవ్ ఎన్క్యాష్మెంట్లు రిటైర్ అయిన వారందరికీ అర్హత చొప్పన ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రాట్యుటీ, ఆఖరు నెల జీతం ఇవ్వాలని పలుమార్లు ఆర్టీసీ ఎండీకి రాతపూర్వక విజ్ఞాపన పత్రాలు ఇచ్చినప్పటికీ వాటిపై స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివిధ కారణాలతో తిరసరించిన పీఎఫ్ అప్లికేషన్లు సైతం సరిచేయడం లేదని రిటైర్డ్ ఉద్యోగులు, కార్మికులు మండిపడుతున్నారు. రిటైర్ అయిన కొందరికి డిమాండ్ నోటీసులు రావడం లేదని, 2013, 2017 వేతన సవరణ వివరాలను పీఎఫ్ కమిషనర్‌కు పంపకపోవడం వల్ల హయ్యర్ పెన్షన్ ఆగిపోయిందని కన్నీటి పర్యంతమవుతున్నారు.