చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టింది. దీంతో ఇద్దరు డ్రైవర్లు సహా 21 మంది దుర్మరణం చెందారు. మరికొందరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. బస్సుపై కంకర లోడు పడిపోవడంతో పలువురు ప్రయాణికులు అందులో కూరుకుపోయారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మూడు జేసీబీల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. కంకరలో కూరుకుపోయిన వారిని బయటకు తీస్తున్నారు. ఇప్పటివరకు 15 మందిని బస్సులోనుంచి బయటకు తీశారు. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
తాండూరు డిపోకు చెందిన ఎక్స్‌ప్రెస్ బస్సు తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వారిలో ఎక్కువగా విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తున్నది. విద్యార్థులు హైదరాబాద్‌లోని పలు కాలేజీల్లో చదువుతున్నట్లు సమాచారం. బస్సుపై టిప్పర్ పడిపోవడంతో డ్రైవర్ వైపు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. ప్రయాణికుల ఆర్తనాదాలతో ప్రమాద స్థలం హృదయవిదారకంగా మారింది. రోడ్డు ప్రమాదంతో హైదరాబాద్-బీజాపూర్ హైవేపై భారీగా ట్రాఫిక్‌జామ్ అయింది. చేవెళ్ల-వికారాబాద్ మార్గంలో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ఘటనా స్థలానికి అంబులెన్స్‌కు కూడా చేరుకోలేని పరిస్థితి ఏర్పడింది.


Busaccident 2