జయశంకర్ భూపాలపల్లి, జూన్ 11 (నమస్తే తెలంగాణ) : సింగరేణి సంస్థలో రూ.1,600 కోట్ల కోల్స్కామ్ను మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు బట్టబయలు చేయగా రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. బొగ్గు కుంభకోణంతోపాటు సింగరేణిలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై హరీశ్‌రావు సింగరేణి పరిరక్షణ సదస్సులు నిర్వహిస్తూ కోల్‌బెల్ట్ బాటపట్టారు. ఆయన పర్యటనతో సింగరేణి అధికారుల్లో వణుకు మొదలైంది. ఏరియా వారీగా మాయమైన బొగ్గును టెల్ (పనికిరాని) బొగ్గుతో కవర్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది.
ఏప్రిల్‌లో రూ.1,600 కోట్ల విలువ చేసే 40 లక్షల టన్నుల బొగ్గు స్కామ్‌ను బీఆర్ఎస్ బయట పెట్టినా ఇంతవరకు ప్రభుత్వం, కేంద్రం నోరుమెదపడం లేదు. కాగా హరీశ్‌రావు శుక్రవారం భూపాలపల్లి ఏరియాలో పర్యటించనున్న నేపథ్యంలో సింగరేణి అధికారులు హడావిడిగా ఇతర గనుల నుంచి బొగ్గును ఓసీ 2 గనిపై నిల్వచేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. భూపాలపల్లి ఏరియాలో 5.40 లక్షల టన్నులు మాయమైనట్టు తెలుస్తుండగా ఆ బొగ్గును సమీకరిస్తూ స్టాక్‌ను చూపించే ప్రయత్నం చేస్తున్నట్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
‘కాంగ్రెస్ హఠావో.. సింగరేణి బచావో’ పేరుతో హరీశ్‌రావు కోల్‌బెల్ట్ యాత్ర చేపట్టి టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో సింగరేణి పరిరక్షణ సదస్సులు నిర్వహిస్తున్నారు. గత ఆదివారం గోదావరిఖనిలో ప్రారంభమైన సదస్సులు సింగరేణి వ్యాప్తంగా కొనసాగనున్నాయి. శుక్రవారం భూపాలపల్లిలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో సదస్సు జరుగనున్నది. ఈ సదస్సుకు హరీశ్‌రావు రానుండగా ఏరియా సింగరేణి అధికారులు అప్రమత్తమై ఓసీ2పై కోల్స్టాక్ చూపించే ప్రయత్నాలను అధికారులు సీక్రెట్‌గా చేస్తున్నట్టు సమాచారం.