సూర్యాపేట టౌన్, మార్చి 14 : మైనర్లు నడుపుతున్న 13 ద్విచక్ర వాహనాలను సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని 60 ఫీట్ల రోడ్డులో పట్టణ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో మైనర్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నిరంతర వాహనాల తనిఖీలు, వాహనాల జరిమానాలు, ఎన్ఫోర్స్మెంట్ నిర్వహణ అనేది ప్రజల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ కోసమేనని ఈ సందర్భంగా ఎస్ఐ సాయిరాం తెలిపారు. పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని తల్లిదండ్రులకు సూచించారు. పిల్లలకు వాహనాలు ఇవ్వడం వల్ల వారు అజాగ్రత్తగా వాహనాలు నడుపుతూ వారు ప్రమాదంలో పడడమే కాక ఎదుటివారిని కూడా ప్రమాదంలో పడేస్తారన్నారు. మైనర్ డ్రైవింగ్ అనేది చట్టరీత్యా నేరమన్నారు. పిల్లలు వాహనాలు నడుపుతూ దొరికినట్లయితే తల్లిదండ్రులపై, వాహన యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. మైనర్ డ్రైవింగ్ కేసుల్లో చిక్కుకునే పిల్లలకు లైసెన్సులు కూడా రావని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.