అహ్మదాబాద్, జూన్ 12: ఇంధనం మండుతున్న కారణంగా.. కూలిపోయిన ఎయిరిండియా విమానంలో ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉన్నందున ఎవరినీ రక్షించే అవకాశం లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. విమానంలో 1.25 లక్షల లీటర్ల ఇంధనం ఉందని, దాని వల్ల విమానంలో అత్యధికంగా ఉష్ణోగ్రత ఉన్నందు వల్ల ఏ ఒక్క ప్రయాణికుడినీ రక్షించడం సాధ్యం కాదని గురువారం నాడిక్కడ ఆయన చెప్పారు. ఈ విషాద ఘటనతో యావత్ దేశం దిగ్భ్రాంతిలో మునిగిపోయిందని అమిత్ షా అన్నారు. డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి మృతులను గుర్తించిన తర్వాత మృతుల సంఖ్యను అధికారులు ప్రకటిస్తారని ఆయన చెప్పారు. ఈ ప్రమాదంలో ఒకే ఒక్క వ్యక్తి బతకడం మంచివార్తని, ఆయనను కలుసుకుని ఇక్కడకు వచ్చానని అమిత్ షా చెప్పారు.
డాక్టర్ ప్రతీక్ జోషీ, డాక్టర్ కోమీ వ్యాస్ దంపతులు తమ ముగ్గురు పిల్లలతో ఎయిరిండియా విమానంలో తీసుకున్న సెల్ఫీ వారి కుటుంబాల్లో అత్యంత విషాదకర ఘట్టంగా చిరకాలం నిలిచిపోతుంది. ఈ దంపతులు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఓ దవాఖానలో పని చేసేవారు. డాక్టర్ ప్రతీక్‌కు లండన్‌లో ఉద్యోగం రావడంతో, ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేసి, లండన్‌లో భర్తతో కలిసి జీవించాలనుకున్నారు. ఆమెను, పిల్లలను లండన్‌కు తీసుకెళ్లేందుకు డాక్టర్ ప్రతీక్ రెండు రోజుల క్రితమే ఇక్కడికి వచ్చారు. వీరంతా కలిసి బుధవారం అహ్మదాబాద్‌కు బయల్దేరారు. ఐదేళ్ల వయసుగల కుమారులు నకుల్, ప్రద్యుత్, కుమార్తె ఎనిమిదేళ్ల మిరయ చిరునవ్వులు చిందిస్తూ తీసుకున్న సెల్ఫీ వైరల్ అయింది.
తీవ్ర ట్రాఫిక్ జామే ఆ మహిళ ప్రాణాలను ఘోర విమాన ప్రమాదం నుంచి కాపాడింది. తాను అహ్మదాబాద్ విమానం ఎక్కేందుకు వస్తుండగా, ట్రాఫిక్ జామ్ కారణంగా చిక్కుకుపోయి 10 నిమిషాలు ఆలస్యంగా విమానాశ్రయానికి వచ్చానని, దీంతో విమానం మిస్సయినట్టు భూమీ చౌహాన్ అనే మహిళ తెలిపారు. అదే తన ప్రాణాలను కాపాడిందని, ప్రమాదం గురించి తెలిసి తీవ్రంగా వణికిపోయానని చెప్పారు. కనీసం నోటి మాట కూడా రావడం లేదని తెలిపారు.
అహ్మదాబాద్: అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఎందరో ఆశలు, ఆశయాలను విచ్ఛిన్నం చేయడమే కాక, పలువురి కలలను కల్లలు చేసింది. ప్రమాద మృతులలో వివాహమైన తర్వాత మొదటిసారి భర్తను కలుసుకోవడానికి వెళ్తున్న ఒక నవ వధువు కూడా ఉంది. రాజస్థాన్ బలోతరా జిల్లాకు చెందిన అరబా గ్రామానికి చెందిన ఖుష్బూ ఈ ప్రమాదంలో మరణించింది. ఈ ఏడాది జనవరిలో ఆమెకు మన్ఫూల్ సింగ్‌తో వివాహమైంది. అతను లండన్‌లో చదువుకుంటున్నాడు. దీంతో వివాహమైన తర్వాత తొలిసారిగా భర్తను కలుసుకోవడానికి ఈ విమానంలో లండన్ వెళ్తూ ప్రమాదంలో మరణించింది. ఈ ప్రమాద మృతులలో చెఫ్‌గా పనిచేయడానికి వెళ్తున్న ఇద్దరు, ఓ వ్యాపారి కుమారుడు, కుమార్తె కూడా ఉన్నారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదం హృదయ విదారక విపత్తుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఈ వర్ణించలేని దుఃఖ సమయంలో బాధితులకు దేశం అండగా నిలస్తుందని ఆమె అన్నారు. ఈ విషాద ఘటన తనలో తీవ్ర దుఃఖాన్ని నింపిందని ఆమె ఎక్స్‌లో తెలిపారు. ‘ఇది హృదయ విదారకమైన విపత్తు. నా ఆలోచనలు, ప్రార్థనలు బాధిత ప్రజలతో ఉన్నాయి. వర్ణించ లేని ఈ దుఃఖ సమయంలో దేశం వారికి తోడుగా నిలుస్తుంది’ అని ఆమె సంతాపం వ్యక్తం చేశారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ దీనిని హృదయ విదారక విషాదంగా అభివర్ణించారు. ఈ ప్రమాదంలో బాధితులకు సహాయం అందించేందుకు అధికారులతో టచ్‌లో ఉంటున్నట్టు చెప్పారు. వెంటనే అహ్మదాబాద్‌కు వెళ్లి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ ఘోర విమాన ప్రమాదంపై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్, ఇతర న్యాయమూర్తులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ప్రమాదంపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చాలా మంది బ్రిటిష్ జాతీయులతో లండన్ వస్తూ అహ్మదాబాద్‌లో విమానం కూలిపోతున్న దృశ్యాలు హృదయ విదారకమైనవని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ‘పరిస్థితి తీవ్రతపై ఎప్పటికప్పుడు నాకు సమాచారం అందుతున్నది. తీవ్రమైన ఈ బాధాకర సమయంలో నా ఆలోచనలు ప్రయాణికులు, వారి కుటుంబాలతో ఉన్నాయి’ అని ఆయన పేర్కొన్నారు.
తమ విమానం ఘోర ప్రమాదానికి గురి కావడంపై అమెరికాకు చెందిన విమాన తయారీ సంస్థ బోయింగ్ స్పందించింది. లండన్ వస్తున్న తమ బోయింగ్ విమానం ప్రమాదానికి గురైన సమాచారం అందిన వెంటనే అహ్మదాబాద్ విమానాశ్రయాన్ని సంప్రదించినట్టు తెలిపింది. అవసరమైన సహకారాన్ని, సహాయాన్ని ఎయిర్ ఇండియా కు అందించడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. ‘మా ఆలోచనలు ప్రయాణికులు, సిబ్బంది, ప్రథమ స్పందనదారులు, ప్రభావితమైన వారందరితో ఉన్నాయి’ అని బోయింగ్ ఆ ప్రకటనలో తెలిపింది.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. లండన్ వెళుతున్న విమానం జనావాసాలపై కుప్పకూలడం తనను ఎంతగానో కలచివేసిందని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రమాదంలో ప్రయాణికులు, స్థానికులు, మెడికోలు మరణించడం దురదృష్టకరమని అన్నారు. మృతుల ఆత్మకు శాంతిచేకూరాలని ఆకాంక్షించారు. ఈ దుఃఖ సమయంలో బాధిత కుటుంబాలకు భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలని కోరుకున్నట్టు పేర్కొన్నారు.
ఎయిర్ ఇండియా విమానం కూలిన ఘటనపై మాజీ మంత్రి హరీశ్‌రావు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి గురువారం ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. మృతుల కుటుంబాలకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు.
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విచారం వ్యక్తంచేశారు. ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో సామాన్యులు, ఉజ్వల భవిష్యత్తు కలిగిన మెడికోలు మరణించడం బాధాకరమని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. వారి ఆత్మలకు శాంతిచేకూరాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తిచేశారు.
అహ్మదాబాద్ విమాన దుర్ఘటనలో మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ ఆకాంక్షించారు. ప్రమాదంలో మెడికల్ కాలేజీ విద్యార్థులు మరణించడం తనను కలిచివేసిందని చెప్పారు.
విమాన ప్రమాదం విచారకరమని మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి పేర్కొన్నారు. ఈ దుర్ఘటన తనను ఎంతగానో కలచివేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. మృతులకు సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు అండగా నిలువాలని ప్రభుత్వాలను కోరారు.
విమాన దుర్ఘటనలో మెడికల్ కాలేజీ విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావు ఆవేదన వ్యక్తంచేశారు. మృతులకు ఘనంగా నివాళుర్పించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
విమాన ప్రమాదం దురదృష్టకరమని మాజీ ఎంపీ వినోద్‌కుమార్ అన్నారు. వైద్యవిద్యార్థులు, అమాయకులు ప్రాణాలు కోల్పోవడం ఎంతగానో బాధించిందని పేర్కొన్నారు. ఈ ఘటనలో మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.