హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): దసరా పండుగ సందర్భంగా నడిపిన ప్రత్యేక బస్సులతో టీఎస్ఆర్టీసీకి దండిగా రాబడి వచ్చింది. ఈ నెల 8 నుంచి 18 వరకు నడిపిన ప్రత్యేక బస్సులతోపాటు సాధారణ బస్సుల ద్వారా మొత్తం రూ.111.91 కోట్ల ఆదాయం వచ్చినట్టు సంస్థ ఎండీ సజ్జనార్ మంగళవారం ప్రకటించారు. సోమవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో రూ.14.79 కోట్లు వచ్చినట్టు వెల్లడించారు. ఇంత భారీగా ఆదాయం రావడానికి కృషిచేసిన ఆర్టీసీ అధికారులు, సూపర్వైజర్లు, ఉద్యోగులు, డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లను ప్రత్యేకంగా అభినందించారు. దసరా పండుగకు ముందు సగటున రూ.9.71 కోట్లుగా ఉన్న రోజువారీ ఆదాయం పండుగ సీజన్లో రూ.10.71 కోట్లకు పెరిగినట్టు తెలిపారు. ప్రైవేటుతో పోలిస్తే ఆర్టీసీ చార్జీలు తక్కువగా ఉండడం, పండుగ సీజన్లోనూ టికెట్ల చార్జీలు పెంచకపోవడం బాగా కలిసొచ్చిందని పేర్కొన్నారు. ఈ నెల 8 నుంచి సోమవారం వరకు టీఎస్ఆర్టీసీ బస్సులు 2,80,84,000 మందికిపైగా ప్రజలను గమ్యస్థానాలకు చేర్చాయని, రోజుకు సగటున 25.54 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారని వివరించారు. పండుగ సీజన్లో ఆర్టీసీ బస్సులను వినియోగించుకొన్న ప్రయాణికులకు సజ్జనార్ కృతజ్ఞతలు తెలిపారు.