కొత్తగూడెం క్రైం, నవంబర్ 22: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో పది మంది మావోయిస్టులు మరణించారు. బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ పాటిలింగం తెలిపిన వివరాల ప్రకారం.. బెజ్జీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొరాజుగూడ, దంతేశ్పురం, నాగారం బండారపదార్ అటవీ ప్రాంతాల్లో కిష్టారం-కొంట ఏరియా కమిటీ మావోయిస్టులు సమావేశమవుతున్నట్లు భద్రతా దళాలకు సమాచారం అందింది. దీంతో డీఆర్జీ, సీఆర్పీఎఫ్ దళాలు గాలింపు చేపట్టాయి. వెంటనే భద్రతా దళాలపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఇరు వర్గాల మధ్య సుమారు రెండు గంటలపాటు కాల్పులు జరిగాయి. మావోయిస్టులంతా పల్లపు ప్రాంతంలో ఉండడంతో ఎత్తయిన ప్రదేశం నుంచి జవాన్లు మావోయిస్టులను ముట్టడించారు. భారీగా మోహరించిన జవాన్ల కాల్పుల ధాటికి తాళలేక మావోయిస్టులు అక్కడి అటవీ మార్గం మీదుగా పారిపోయారు. ఘటన స్థలం నుంచి పది మంది మావోయిస్టుల మృతదేహాలతోపాటు ఒక ఏకే-47, ఎస్ఎల్ఆర్లు, ఇన్సాస్ రైఫిళ్లు, ఆటోమెటిక్, సెమీ-ఆటోమెటిక్ ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా.. మృతుల్లో రూ.21 లక్షల రివార్డు ఉన్న మావోయిస్టులు ఆరుగురు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
పది మంది మావోయిస్టులను మట్టుబెట్టిన తర్వాత డీఆర్జీ బలగాలు ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున సంబురాలు చేసుకున్నాయి. విశాలమైన ప్రదేశంలో హుషారైన పాటలతో తుపాకులు పైకెత్తి సమూహంగా నృత్యాలు చేస్తూ జవాన్లు తమ విజయాన్ని వ్యక్తం చేశారు. ఈ వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
మృతిచెందిన పది మంది మావోయిస్టుల్లో ముగ్గురు మహిళలు, ఏడుగురు పురుషులు ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు. వీరిలో దూధి మాసా (డీవీసీఎం), మాద్వి లక్ష్మా (ఏసీఎం), డోరో కోసి (ఏసీఎం), కుంజమ్ బమన్, కాటం కోసం (పీఎల్జీఏ కంపెనీ 8 కమాండర్), దూధి హంగీ (దూధి మాసా భార్య) ఉన్నారు. మిగతా నలుగురు మావోయిస్టులను ఇంకా గుర్తించాల్సి ఉన్నట్టు అధికారులు తెలిపారు.