ధర్మపురి, ఏప్రిల్ 30: కూలీ పని చేసి కుటుంబాన్ని పోషిస్తున్న క్రమంలో పక్షవాతంతో మంచానికే పరిమితమైన వ్యక్తికి ఫేస్బుక్ మిత్రులు అండగా నిలిచారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాలకు చెందిన వడ్లకొండ నారాయణ కొంతకాలంగా ధర్మపురిలో నివాసం ఉంటూ పాత ఇనుప సామాన్లు అమ్ముతూ ఉపాధి పొందుతున్నాడు. రెండేండ్లుగా పక్షవాతంతో మంచానికే పరిమితం కాగా, భార్య సుజాత బీడీలు చుడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నది.
అలాగే నల్లగొండ జిల్లా రోటెగడ్డ తండాకు చెందిన నెనావత్ అశోక్ కొన్నేండ్ల క్రితం తన భార్య, పిల్లలతో హైదరాబాద్ వచ్చి అటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఏడాది క్రితం పక్షవాతం వచ్చి మంచానికే పరిమితమయ్యాడు. దీంతో భార్య ఇండ్లల్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నది. ఈ ఇద్దరి దీనగాథను తెలుసుకొని ధర్మపురికి చెందిన సామాజిక సేవకుడు రేణికుంట రమేశ్ చలించిపోయాడు.
వీరి పరిస్థితిని వివరిస్తూ సాయం చేయాలని ఫేస్బుక్లో పోస్టు చేయగా, స్పందించిన తెలుగు రాష్ర్టాలకు చెందిన ఎన్నారైలు రూ.1.30 లక్షలు సమకూర్చారు. ఈ రకంగా అందిన సాయంలో ఒక్కొక్కరికీ రూ.65 వేల చొప్పున ధర్మపురిలో శనివారం సీఐ బిల్లా కోటేశ్వర్, ఎస్సై కిరణ్కుమార్, యూనియన్ బ్యాంక్ మేనేజర్ రవితేజ అందజేశారు.