ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనుల్లో మరింత పారదర్శకత కోసం పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టంను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు జడ్పీ, మండల పరిషత్, గ్రామ పంచాయతీల నిర్వహణ కోసం కొత్త ఖాతాలను తెరవాలని నిర్ణయించింది. ప్రస్తుతమున్న కరెంట్ ఖాతాలకు బదులుగా సేవింగ్ అకౌంట్లను తెరవాలనే ఆదేశాల మేరకు , అన్ని జిల్లాల్లో అధికార యంత్రాంగం ఇప్పటికే చర్యలు చేపట్టింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నిర్మల్ టౌన్, మార్చి 19 : పల్లెల ప్రగతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక నిధులను విడుదల చేస్తున్న నేపథ్యంలో అభివృద్ధి పనుల్లో పారదర్శకత కోసం పబ్లిక్ ఫైనాల్సియల్ మేనేజ్మెంట్ సిస్టంను అందుబాటులోకి తీసుకురానున్నది. ఈ మే రకు రాష్ట్ర పంచాయతీరాజ్ కార్యదర్శి అన్ని జిల్లాలోని స్థానిక సంస్థలైన జడ్పీ, మండల పరిషత్, గ్రామ పంచాయతీల నిర్వహణ కోసం కొత్త ఖాతాలను తెరవాలని ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం పల్లె ప్రగతితో గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తుండగా.. జిల్లా, మండల పరిషత్‌ల ద్వారా అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న నేపథ్యంలో నిధులు దుర్వినియోగం కాకుండా పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టంను తీసుకొచ్చి నిధులపై నిఘా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 15వ ఆర్థిక సంఘం కింద ప్రతినెలా గ్రామ పంచాయతీ, మం డల, జిల్లా పరిషత్‌లకు నిధులు కేటాయిస్తున్నారు. అయితే గ తంలో పంచాయతీ నిధులు డీపీవో ఖాతాల్లో, మండల పరిషత్ జడ్పీశాఖ ఖాతాల్లో జమ చేస్తే తర్వాత ఆ నిధులను ఆయా మండలాలకు విడుదల చేసేవారు. ఈ నిధుల కోసం జీపీ, మం డల, జడ్పీ ఖాతాలను ఎస్బీఐ ద్వారా కరెంట్ ఖాతా ఉంటేనే జమయ్యేవి. ఇప్పుడు తాజాగా ప్రభుత్వం పాత ఖాతాలు కా కుండా కొత్త ఖాతాలు తెరవాలని ఆదేశించడంతో మూడు రోజులుగా ఉమ్మడి జిల్లాలో కొత్త ఖాతాలను తెరుస్తున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలుండగా.. మొత్తం 1507 గ్రామ పంచాయతీలున్నాయి. 68 మండలాలుండగా.. నాలుగు జిల్లా పరిషత్‌లు ఉన్నాయి. ఆదిలాబాద్‌లో 465, నిర్మల్‌లో 396, ఆసిఫాబాద్‌లో 335, మంచిర్యాలలో 311 పంచాయతీలుండగా.. నిర్మల్‌లో 19, ఆదిలాబాద్‌లో 17, మంచిర్యాలలో 16, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 15 మండలాలున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ మండలాలకు 15వ ఆర్థిక సంఘం ద్వారా విడుదలైన నిధులకు కరెంటు ఖాతాలు ఉండడంతో ప్రభుత్వం నేరుగా నిధులు ఆ ఖాతాలో జమ చేయకుండా జిల్లా శాఖ కార్యాలయంలో జమ చేసి ఆ తర్వాత స్థానిక సంస్థలకు పంపిణీ చేసేవారు. ప్రస్తుతం కరెంటు ఖాతాలను రద్దు చేసి కొత్తగా సేవింగ్ ఖాతాలను ప్రారంభించాలని పంచాయతీరాజ్‌శాఖ కార్యదర్శి మూడు రోజుల క్రితమే ఉత్తర్వులు జారీ చేయడంతో అన్ని గ్రామాల్లో కొత్త ఖాతాలను తెరుస్తున్నారు. సర్పంచ్, ఉప సర్పంచ్ పేరుమీద ఎస్బీఐలో అకౌంట్లు తీయాలని సూచించడంతో సర్పంచ్‌లు జీరో ఖాతాను తెరుస్తున్నారు. ప్రభుత్వం ఎప్పుడు నిధులు విడుదల చేసినా నేరుగా వారి ఖాతాల్లోనే జమ కానున్నాయి. గ్రామాల్లో ఏ అవసరం ఉన్న పంచాయతీ తీర్మానం చేసి ఆ నిధులను వినియోగించుకునేందుకు అవకాశం రానున్నది. గతంలో కరెంటు ఖాతాలు ఉండడం వల్ల నిధులను డ్రా చేయడంలో జాప్యం జరిగేదని అధికారులు పేర్కొంటున్నారు. అదేవిధంగా గ్రామ పంచాయతీల్లో జమైన నిధులు అవి ఏ పనికి ఎంత వరకు ఉపయోగించారు.. మిగిలిన నిధులెన్ని.. అన్ని వివరాలు పబ్లిక్ ఫైనాల్సియల్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా ప్రతి ఒక్కరికీ తెలిసే అవకాశం ఉంటుంది. ఈ విధానం వల్ల పంచాయతీకి ప్రభుత్వం విడుదల చేసిన నిధులు దుర్వినియోగం అయ్యే అవకాశం లేకుండాపోతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం నిధులు దుర్వినియోగం కాకుండా ఉం డేందుకు జీరో సేవింగ్ ఖాతాలను తీయాలని నిర్ణయించడం సంతోషంగా ఉన్నది. గతంలో పంచాయతీకి సంబంధించిన వివిధ ఆర్థిక సంఘం ద్వారా విడుదలైన నిధులు జిల్లా అధికారుల ఖాతాల్లో వేసేవారు. తిరిగి గ్రామ పంచాయతీ కరెంట్ ఖాతాల్లో వేసేందుకు 15-20 రోజుల సమయం పట్టేది. ఇప్పుడు నేరుగా నిధులు సేవింగ్ ఖాతాల్లో జమ కానుండడం ఆనందంగా ఉన్నది.
అంకం గంగామణి, న్యూవెల్మల్ సర్పంచ్, సోన్ మండలం
తెలంగాణ ప్రభుత్వం హయాం లో సర్పంచ్‌లుగా పని చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సర్కారు ప్రతినెలా నేరుగా పం చాయతీ ఖాతాలో వివిధ ఆర్థిక సంఘం నిధులను విడుదల చే యడంతో గ్రామంలో అనేక పనులు చేపట్టినం. ప్రభుత్వం ఇప్పుడు కరెంట్ ఖాతా స్థానంలో సేవింగ్ ఖాతా తెరిస్తే నేరుగా నిధులను గ్రామ పంచాయతీ ఖాతాలోనే జమ చేయాలని చెప్పడం ఆనందంగా ఉన్నది.
ధర్మారం సుజాత పోశెట్టి, అక్కాపూర్, నిర్మల్ మండలం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పల్లె ప్రగతికి ఆర్థిక సంఘం ద్వారా విడుదల చేసే ని ధులు పారదర్శకంగా వినియోగించుకోవాలనే ఉద్దేశంతో సేవింగ్ ఖాతాలను ప్రారంభిస్తున్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1507 పంచాయతీలుండగా.. ఇప్పటికే 500కు పైగా సేవింగ్ ఖాతాలను తెరిపించాం. ఇప్పుడు పంచాయతీకి ఎన్ని నిధులు వచ్చాయి.. ఎంత ఖర్చు అవుతుందో రోజువారీగా పబ్లిక్ ఫైనాల్సియల్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది.
-వెంకటేశ్వర్రావు, జిల్లా పంచాయతీ అధికారి