హైదరాబాద్, మే 31 (నమస్తేతెలంగాణ):రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు పదిరోజుల్లో ప్రవేశించనున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రుతుపవనాలు జూన్ 10 నుంచి 12 తేదీల మధ్య రాష్ర్టాన్ని తాకే అవకాశం ఉన్నదని అంచనా వేస్తున్నది. వచ్చే నాలుగైదు రోజుల్లో కేరళతో పాటు తమిళనాడులోని పలు ప్రాంతాలు రుతుపవనాల ప్రవేశానికి అనుకూల పరిస్థితులు ఉన్నట్టు వెల్లడించింది.
వచ్చే నాలుగు రోజులు క్రమంగా 2 నుంచి 3 డిగ్రీల మేర గరిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుతాయని అధికారులు తెలిపారు. జూన్ మొదటి వారంలో రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని స్పష్టం చేశారు. కాగా నిరుటితో పోలిస్తే రాష్ట్రవ్యాప్తంగా 8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది.
రాష్ట్రంలోని మంచిర్యాల, పెద్దపల్లి, ములుగు, నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ఆదివారం 45 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణశాఖ తెలిపింది. 22 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో అత్యధికంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 45.4 డిగ్రీలు నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో 41.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భానుడి ప్రతాపంతో నిప్పుల కుంపటిగా ఉన్న రాష్ట్రం ఒక్కసారిగా వాతావరణం సాయంత్రం మారింది. ఆదిలాబాద్ జిల్లా రైతులు మార్కెట్ యార్డులో పోసిన జొన్నలు తడిసి ముద్దయ్యాయి. మంచిర్యాల జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి ధాన్యం కొట్టుకుపోయిందని రైతులు ఆందోళన చెందుతున్నారు.