సిటీబ్యూరో, మే 31(నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్‌రంజన్ భార్య హత్య, దోపిడీ కేసులో పనిమనిషి కల్పన నేతృత్వంలోని నేపాలీ ముఠా దేశం దాటి నేపాల్‌లోకి పారిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. నిం దితుల కోసం రంగంలోకి దిగిన పది పోలీసు బృందాలు భారత్-నేపాల్ సరిహద్దుతో పాటు ఫుణె, ముంబై, ఢిల్లీ, యూపీ, బీహార్, మధ్యప్రదేశ్‌లో పలుచోట్ల ముమ్మురంగా గాలించారు.
వినయ్‌రంజన్‌రాయ్ ఇంట్లో పనిచేసిన కల్పన రచించిన ప్రణాళికతోనే ఏడుగురు సభ్యుల ముఠా ఈ దోపిడీకి పాల్పడిందని, అయితే కల్ప న మాత్రం పోలీసుల కళ్లుగప్పి సరిహద్దు నుంచి రహస్యమార్గాల ద్వారా నేపాల్‌కు చేరినట్లు తెలిసినట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. ఈకేసులో కల్పనకు సహకరించిన ఒక్కరు మాత్రమే పోలీసులకు పట్టుబడగా మిగతావారంతా దాదాపు నేపాల్‌కు చేరిఉంటారని సజ్జనార్ తెలిపారు. కల్పన ముఠాను పట్టుకునేందుకు ఆపరేషన్ నేపాల్ పేరుతో ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపామని, త్వరలోనే ఓ పోలీసు బృందాన్ని నేపాల్‌కు పంపుతున్నామని సజ్జనార్ తెలిపారు.
ఏడాదిలో ఆరు దోపిడీలు..
ఒక్క ఏడాదిలోనే దాదాపు 6 దోపిడీలకు పాల్పడిన నేపాలీ దొంగల వ్యవహారం నగరవాసులకు ప్రత్యేకించి పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటివరకు జరిగిన ఘటనల్లో ఒకట్రెండు మినహాయిస్తే మిగతావాటిలో అసలు సూత్రధారులు ఇప్పటికీ దొరకలేదని పోలీసులే చెబుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 45లో ఓ వ్యాపారి ఇంట్లో తోటమాలిగా చేసిన భార్యాభర్తలు.. యజమానులు వేరే ప్రదేశానికి వెళ్లిన సమయంలో ఆరుగురు ముఠా సభ్యులతో కలిసి ఇంట్లోని రూ.2కోట్లు చోరీ చేసి పరారయ్యారు. వారిని నేపాల్‌లో పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు వారిని అక్కడే వదిలేసి వచ్చినట్లు తెలిసింది.
గత సంవత్సరం మే నెలలో కాచిగూడ పరిధిలోని ఓ పారిశ్రామిక వేత్త ఇంట్లో భారీ చోరీకి పాల్పడిన నేపాలీ ముఠా రూ.1.5కోట్ల సొమ్ముతో ఉడాయించింది. ఇంటి యజమానులకు భోజనంలో మత్తు మందు కలిపి, ఇంట్లో ఉన్న బంగారం, వజ్రాలు, వెండి, నగదుతో సహా పరారయ్యారు. వీరిని పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాలు, దొంగలకంటే ముందే విమానంలో ఢిల్లీ, నేపాల్ సరిహద్దుల్లోకి చేరకున్నప్పటికీ దొంగలు మాత్రం దొరకలేదు.
వీరు రహస్య మార్గాల ద్వారా నేపాల్‌కు చేరుకుని ఉంటారని భావించిన సీపీ.. దొంగల ముఠా నేపాల్‌లోని కైలాలీ జిల్లాకు చెందినవారుగా గుర్తించి ఆపరేషన్ కైలాలీ పేరుతో ఒక ప్రత్యేక బృందాన్ని ఆ దేశానికి పంపారు. అక్కడ వారి చిరునామాలలో గాలించినప్పటికీ వారు భారత్ దాటి నేపాల్‌కు వెళ్లలేదని తెలిసింది. అయితే వారు భారత్‌లో ఎక్కడ దాచుకున్నారనేది ఇప్పటికీ తేలలేదు. చేసేది లేక నేపాల్ దొంగల ముఠాకు చెందిన అనుమానిత ఫోటోలను విడుదల చేసిన పోలీసులు, ఇండియా-నేపాల్ సరిహద్దుల్లో లుక్అవుట్ నోటీసులు జారీచేశారు. దొంగల ఆచూకీ తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలంటూ డీసీపీ, ఏసీపీ, ఎస్హెచ్ఓ, డీఐ నంబర్లతో పోస్టర్ విడుదల చేశారు.
ఆపరేషన్‌లో సంచలన విషయాలు..!
నేపాలీ దొంగలను పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులు ఆపరేషన్ నేపాల్ పేరుతో గతంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఆ సమయంలో దొరికిన కొందరిని విచారిస్తే సంచలన విషయాలు వెలుగుచూశాయి. గత కొన్నేళ్లుగా దేశంలో వివిధ రాష్ర్టాల్లో పనిచేస్తున్న నేపాలీలు దొంగతనాలు ఎలా చేస్తున్నారు. ఎలాంటి వ్యూహం అమలు చేస్తున్నారంటూ ఆరా తీయగా ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ఈ ముఠా సభ్యులంతా ఒకేచోట ఉండరు.
హైదరాబాద్, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఒక్కొక్కరు ఇంటి పనికి చేరతారు. ఎక్కడ గిట్టుబాటు అవుతుందో తెలిసిన తర్వాత అందరూ అక్కడికి చేరుకొని పక్కాప్లాన్ ప్రకారం సొత్తుతో ఉడాయిస్తారు. ఎక్కువగా నేపాల్ నుంచి తెచ్చిన మత్తుమందు వాడటం, లేదా ఇంటి యజమానులు లేని సమయాలు చూసి దోపిడీ చేస్తారని పోలీసుల విచారణలో తేలింది. ఒకకసారి దొంగతనం చేసిన వారు అదే నగరంలో తిరిగి కొంతకాలం వరకు దొంగతనం చేయరని చెప్పారు.
ఒక్క చోరీతో లైఫ్‌లో సెటిలైపోవాలి..!
నేపాల్‌లోని ఏడు రాష్ట్రభాగాల్లో సుదూర పశ్చిమ్‌ప్రదేశ్ ఒకటి. ఇందులో కైలాలీతో పాటు మరో మూడు, నాలుగు జిల్లాల్లో ఈ దొంగల ముఠాలుంటాయి. నలుగురైదుగురు కలిసి ఒక ముఠాగా ఏర్పడటం, మెట్రో నగరాల్లోని విలాసవంతమైన ఇళ్లల్లో పనికి కుదురుతారు. నెలల తరబడి నమ్మకంగా పనిచేసి యజమానుల నమ్మకం చూరగొన్నాక అసలు ప్రణాళికను అమలు చేస్తున్నారని, తమ దర్యాప్తులో వెల్లడైనట్లు పోలీసులు చెప్పారు. దొంగిలించిన సొత్తును నేపాల్‌లో వీరు తక్కువ ధరకే విక్రయిస్తారని, ఆ డబ్బులతో విలాసవంతమైన జీవితాలు గడుపుతారని వారు పేర్కొన్నారు.
ఈ దొంగలకు రెండు ఇళ్లుంటాయి. ఊరిలో ఒకటి, గుట్టలపై ఒకటి.. వారి కోసం పోలీసులు వచ్చినట్లు తెలిస్తే గుట్టపైకి వెళ్లి అక్కడినుంచి పోలీసు రాకకపోకలను గమనిస్తారు. ఒక్క తెలంగాణ పోలీసులకే కాకుండా వివిధ రాష్ర్టాల పోలీసులకు కూడా ఈ నేపాల్ దొంగలు తలనొప్పిగా మారారు. తెలంగాణ పోలీసులు ఘటన జరిగిన తర్వాత ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి నేపాల్ వరకు వెళ్లినా అక్కడ ఉన్న పరిస్థితులు వారికి సహకరించడం లేదనే చర్చ జరుగుతోంది.
ఇటీవల జూబ్లీహిల్స్‌లోని ఒక వ్యాపారవేత్త ఇంట్లో జరిగిన దోపిడీలో ఇద్దరు ప్రధాన నిందితులను నేపాల్ సరిహద్దు దాటిన తర్వాత తెలంగాణ పోలీసులు పట్టుకున్నప్పటికీ.. వారిని తిరిగి తీసుకురావడంలో దౌత్యపరమైన సమస్యలు అడ్డువచ్చినట్లు సమాచారం. తాము ఇంత కష్టపడి పట్టుకున్న ప్రధాన నిందితులను అక్కడి కోర్టులో హాజరుపరిచి తిరిగి ఖాళీ చేతులతో వెనక్కురావడంతో పోలీసులు నిరాశకు గురవుతున్నారు. మరో ముఖ్యమైన అంశమేంటంటే చోరీకి పాల్పడే దొంగల ముఠాకు వారి నాయకుడు ఒకేసారి కొట్టేయండి.. వెనక్కు వచ్చేయండి.. లైఫ్‌లో సెటిలైపోవాలని చెప్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో పట్టుబడ్డ దొంగలు చెప్పినట్లు తెలిసింది. ఇప్పటివరకు ఈ నేపాలీ ముఠాల వెనక ఉన్న మాస్టర్‌మైండ్‌ను పోలీసులు కనిపెట్టలేకపోయారు.