యాసంగి సీజన్లో రైతుల పరిస్థితి ‘మూలిగే నక్కపై తాటిపండు పడ్డ’ చందంగా మారింది. ఓవైపు సాగునీరు లేక పంటలను కాపాడుకునేందుకు అరిగోస పడుతుంటే.. మరోవైపు అకాల వర్షం నిండా ముంచింది. గురువారం రాత్రి దంచికొట్టగా, చేతికొచ్చిన పంటలు నేలకొరిగాయి. జొన్న, మక్క, నువ్వు పంటలకు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. కండ్ల ముందే నష్టం వాటిల్లడంతో రైతులు కంటతడి పెడుతున్నారు. తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
Rain | ఆదిలాబాద్, ఏప్రిల్ 4 ( నమస్తే తెలంగాణ)/నేరడిగొండ/తాంసి, ఏప్రిల్ 4 : ఆదిలాబాద్ జిల్లాలో గురువారం సాయంత్రం ఈదరుగాలులతో కూడిన వానతో నేరడిగొండ, తాంసి, తదితర మండలాల్లో చేతికందిన జొన్న, మక్క, నువ్వు పంటలకు నష్టం వాటిల్లింది. జిల్లాలో ఎక్కువగా జొన్న పంటను సాగు చేశారు. పంట కోతల సమయంలో కురిసిన అకాల వర్షంతో జొన్న నేలకొరిగింది. వ్యవసాయ శాఖ అధికారులు పంటనష్టం అంచనాలు తయారు చేస్తున్నారు. యాసంగిలో ఎంతో కష్టపడి సాగుచేసిన జొన్న పంట అకాల వర్షాల కారణంగా నష్టపోవాల్సి వచ్చిందని ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
నేరడిగొండ మండలంలోని కుప్టి, కుమారి, వడూర్, వాంకిడి, రాజురా, ఈస్పూర్, గౌలిగూడ, నారాయణపూర్, బోరిగాం,తర్నం, వాగ్దారి, తదితర గ్రామాల్లో జొన్న, మక్క, నువ్వు తదితర పంటలు సాగుచేశారు. గురువారం రాత్రి కురిసిన వానతో కుప్టి గ్రామానికి చెందిన బాదం వెంకటరమణ, గణేశ్, కుమారి గ్రామానికి చెందిన రాంలక్ష్మణ్ అనే రైతుల పంటలు పూర్తిగా నేలకొరిగి దెబ్బతిన్నాయి. ప్రభుత్వం స్పందించి పంట నష్టానికి పరిహారం అందించి ఆదుకోవాలని బాధిత రైతులు కోరారు.
తాంసి మండలంలోని పొన్నారి, హస్నాపూర్, వడ్డాడి గ్రామాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ముఖ్యంగా జొన్న, మొకజొన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చేతికి వచ్చిన పంట కోతల తర్వాత కల్లాల్లో ఆరబోయగా అకాల వర్షంతో ధాన్యం తడిసి ముద్దయింది. ప్రభుత్వం పంట నష్టం పరిశీలించి తగిన నష్టపరిహారం అందించాలని రైతులు వేడుకుంటున్నారు.