షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకాలు పేదలకు వరం
చెక్కుల పంపిణీలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
ఖమ్మం, సెప్టెంబర్ 8: ప్రజా సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఆడపిల్లలున్న పేదలకు వరంలా మారాయని అన్నారు. ఆడపిల్లల తల్లిదండ్రులను ఇంతలా ఆదుకుంటున్న సీఎం కేసీఆర్‌కు వారంతా రుణపడి ఉంటారని అన్నారు. నియోజకవర్గంలోని లబ్ధిదారులకు మంజూరైన రూ.1.27 కోట్ల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ వీపీ గౌతమ్, కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభితో కలిసి గురువారం లబ్ధిదారులకు ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
గతంలో ఏ ప్రభుత్వమూ అమలు చేయని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డల కోసం ఈ పథకాలు అమలు చేస్తోందని అన్నారు. చెక్కులు అందుకుంటున్న ఆడబిడ్డల తల్లిదండ్రులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని, సీఎం కేసీఆర్ చల్లగా ఉండాలని దీవిస్తున్నారని అన్నారు. గడిచిన నాలుగేళ్లలో ఖమ్మం నగరంలో 5,724 మందికి రూ.53.83 కోట్లు, నియోజకవర్గంలో 7,279 మందికి రూ.70 కోట్ల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందించినట్లు వివరించారు. అనంతరం మంత్రి, కలెక్టర్, కేసీఆర్ కమిషనర్లు లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, టీఆర్ఎస్ నాయకులు ఆర్జేసీ కృష్ణ, పగడాల నాగరాజు, మాజీ ఎమ్మెల్యే చంద్రావతి, కార్పొరేటర్లు కర్నాటి కృష్ణ, బీజీ క్లెయిమెంట్, తహసీల్దార్ శైలజ పాల్గొన్నారు.
పేదలకు గౌరవం.. ఆసరా పింఛన్లు
ఖమ్మం, సెఫ్టెంబర్ 8: పేదలకు గౌరవప్రదమైన జీవితాన్ని అందించేందుకే ఆసరా పింఛన్లు ఇస్తున్నామని, ఇందుకోసమే సీఎం కేసీఆర్ కూడా పింఛన్ల అర్హత వయసు 57 ఏళ్లకు తగ్గించారని మంత్రి అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఖమ్మంలోని 6, 7, 17, 19, 27, 28, 30, 31, 57 డివిజన్ల లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్ల గుర్తింపు కార్డులను గురువారం సాయంత్రం మంత్రి అజయ్ తన క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవని సృష్టం చేశారు.