
శంషాబాద్ రూరల్, జూలై 22: గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని, సీఎం కేసీఆర్ చొరవతో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. గురువారం శంషాబాద్‌లో పర్యటించిన ఆయన రూ. 19కోట్లతో నిర్మించనున్న రహదారుల పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ అభివృద్ధికి భారీ ఎత్తున నిధులు కేటాయిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా 24న ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, పాలకవర్గం సభ్యులు కలిసి కట్టుగా గ్రామాలను హరితవనాలుగా మార్చడం కోసం మొక్కలు నాటి గ్రీన్ గ్రామ పంచాయతీలుగా తయారు చేయాలన్నారు. విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి దేశంలో ఎక్కడా లేదన్నారు. ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, శంషాబాద్ ఎంపీపీ జయమ్మశ్రీనివాస్, జడ్పీటీసీ తన్విరాజు, వైస్ ఎంపీపీ నీలంనాయక్, ఎంపీడీవో వినయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.