ఆలేరు నియోజకవర్గానికి రూ.40 కోట్లు విడుదల
ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ మేరకు నిధులు
118 పంచాయతీలు, 2 మున్సిపాలిటీలకు లబ్ధి
త్వరలో అభివృద్ధి పనులు ప్రారంభం
ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి
యాదాద్రి, ఫిబ్రవరి2 : వాసాలమర్రి వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఆలేరు నియోజకవర్గంలో ఒక్కో గ్రామానికి రూ. 25 లక్షలు, మున్సిపాలిటీకి రూ.50 లక్షల చొప్పున నిధులు మంజూరయ్యాయని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి తెలిపారు. బుధవారం యాదగిరిగుట్ట పట్టణంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. 188 గ్రామ పంచాయతీలతో పాటు ఆలేరు, యాదగిరిగుట్ట మున్సిపాలిటీలకు కలిపి ఎస్డీఎఫ్ నిధులు రూ. 48 కోట్లు విడుదలయ్యాయని చెప్పారు. ఈ నిధులతో 1019 పనులను ఎంపిక చేసి అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. నిధుల వినియోగంపై ఆయా గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, సీనియర్ సిటిజన్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పనులను ఎంపిక చేయనున్నట్లు వివరించారు. ముఖ్యంగా గ్రామాల్లో సీసీ, కమ్యూనిటీ భవనం, ఇతర పనులు చేస్తామని తెలిపారు. ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీ వాడలు, గ్రామాల్లో మొదటి ప్రాధాన్యతగా వారికి ప్రత్యేక నిధులు కేటాయింపు జరుగుతుందన్నారు. కొవిడ్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా గ్రామ పంచాయతీ నిధులను ప్రభుత్వం ఏనాడూ నిలిపి వేయలేదని చెప్పారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా అద్భుతమైన ఫలితాలు సాధించామన్నారు. నిధుల మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, సహకరించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.