
కోటపల్లి/ వేమనపల్లి/ కౌటాల , ఏప్రిల్ 19: ప్రాణహిత ( Pranahitha Pushkaralu ) తీరానికి భక్తజనం పోటెత్తింది.

ఏడో రోజు మంగళవారం సుమారు 52 వేల మందికి పైగా పుణ్య స్నానాలు చేసినట్లు అధికార యంత్రాంగం తెలిపింది.

కోటపల్లి మండలం అర్జునగుట్ట వద్ద ప్రాణహిత తీరానికి సుమారు 50 వేల మంది తరలివచ్చినట్లు అధికారులు తెలిపారు.

అర్జున గుట్ట వద్ద ట్రాఫిక్, భద్రతా సమస్యలు తలెత్తకుండా ఏసీపీ నరేందర్, సీఐ నాగరాజు, ఎస్ఐ రవి కుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

బందోబస్తులో ఉన్న పోలీస్ యంత్రాంగం వైర్లెస్ సెట్ల ద్వారా పర్యవేక్షిస్తున్నారు.

ఎమ్మెల్సీ బొగ్గారుపు దయానంద్ గుప్తా, సింగరేణి డైరెక్టర్ టీ సత్యనారాయణ, మాజీ మంత్రి బోడ జనార్దన్ పుణ్య స్నానాలు ఆచరించారు.

బాల్క పౌండేషన్ ఆధ్వర్యంలో వైస్ ఎంపీపీ వాల శ్రీనివాస్ రావు మజ్జిగ పంపిణీ చేశారు. సైకిల్ బాబా ఆధ్వర్యంలో వేంకటేశ్వర స్వామికి చక్రస్నానం చేయించారు.
కౌటాల మండలం తుమ్మిడి హెట్టి వద్ద ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సతీమణి రమాదేవి, జడ్పీ వైస్ చైర్మన్ క్రిష్ణారావు సతీమణి రుక్మిణి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి దీపాలు వదిలారు. అన్నదాన కేంద్రంలో భక్తులకు రమాదేవి భోజనం వడ్డించారు.

వేమనపల్లి వద్ద భక్తులకు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సహకారంతో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోలి వేణుమాధవ్‌రావు ఆధ్వర్యంలో కేతనపల్లి టీఆర్ఎస్ నాయకులు అన్నదానం నిర్వహించారు.

సోమవారం వరకు 14 వేల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించగా మంగళవారం దాదాపు వెయ్యి మంది వచ్చినట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. జడ్పీటీసీ ఆర్. స్వర్ణలతా సంతోష్‌కుమార్ అన్నదానం చేశారు.

కోటపల్లిలో సర్పంచ్ గుర్రం లక్ష్మి, రైతుబంధు మండల కన్వీనర్ గుర్రం రాజన్న, తుమ్మిడిహట్టి వద్ద ఘాట్ ఇన్చార్జి వేణుగోపాల గుప్తా, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కుమ్రం మాంతయ్య, ఎంపీపీ బసార్కర్ విశ్వనాథ్, ఎంపీవో శ్రీధర్ రాజు, సీఐ స్వామి, ఎస్ఐ మనోహర్, తదితరులున్నారు.

వేమనపల్లిలో ఎంపీపీ ఆత్రం గణపతి, కో ఆప్షన్ సభ్యుడు ముజ్జు, పార్టీ మండలాధ్యక్షుడు కోలి వేణుమాధవ్‌రావు, సర్పంచ్ కుబిడె మధుకర్, టీఆర్ఎస్ కేతనపల్లి గ్రామ అధ్యక్షుడు గురుండ్ల బుచ్చుమేర, మాజీ సర్పంచ్ బొద్దున శంకర్, హనుమాండ్ల సంతోష్, బొద్దున వెంకటేశం, ఆర్బీఎస్ మండల కో ఆర్డినేటర్ భీమయ్య, మాజీ ఎంపీపీ కుర్రు వెంకటేశం పాల్గొన్నారు.

కోటపల్లి మండలంలోని అర్జునగుట్ట వద్ద భక్తులు వారి సెల్ఫోన్లలో ఫోటోలను దిగుతూ వారి వెంట పుష్కర జ్ఞాపకాలను తీసుకెళ్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇలా విభిన్నంగా ఫొటోలు దిగుతూ కనిపిస్తున్నారు. మంగళవారం యువతి ఇలా పడవ నడుపుతూ ఫొటో దిగుతూ కనిపించింది.

కోటపల్లి. ఏప్రిల్ 19: ప్రాణహిత పుష్కరాల కోసం శ్రీకాకుళం నుంచి కుటుంబ సభ్యులమంతా వచ్చినం. ఇక్కడ ఏర్పాట్లు బాగున్నయ్. పుష్కరాలు ఎక్కడ జరిగినా వెళ్లి పుణ్య స్నానాలు ఆచరిస్తాం. ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. కుటుంబమంతా కాసేపు ప్రాణహితలో సరదాగా గడిపి, పూజలు చేసినం. సల్లంగ చూడమని గంగమ్మను కోరుకున్నం.
-నీలా కుమారి, శ్రీకాకుళం