న్యూఢిల్లీ : కరోనా కట్టడికి అత్యవసర వినియోగం కింద జైకోవ్-డి టీకాకు అనుమతి ఇవ్వాలని జైడస్ క్యాడిలా సంస్థ భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ)కి గురువారం దరఖాస్తు చేసుకొన్నది. 50కి పైగా కేంద్రాల్లో 28వేల మంది వలంటీర్లపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించినట్టు తెలిపింది. ఈ టీకా సామర్థ్యం 66.6% అని మధ్యంతర అధ్యయనాల్లో తేలింది. ఇది మూడు డోసుల టీకా. అయితే రెండు డోసులు వేసుకొంటే ఎలాంటి రక్షణ లభిస్తుందన్నదానిపై పరిశోధనలు చేస్తున్నట్టు సంస్థ తెలిపింది. ఈ టీకాను 12-18ఏండ్ల వయస్సున్న వారికీ ఇవ్వవచ్చని క్యాడిలా హెల్త్‌కేర్ ఎండీ షర్విల్ పటేల్ చెప్పారు. జైకోవ్-డి టీకా ప్లాస్మిడ్ డీఎన్ఏ వ్యాక్సిన్. సార్స్-కోవ్-2 వైరస్‌లోని డీఎన్ఏను తీసుకొని, యాంటిబాడీలను ఉత్పత్తి చేసి వాటి ద్వారా టీకా తయారు చేశారు. దీనికి డీసీజీఐ ఆమోదం తెలిపితే ప్రపంచంలోనే మొదటి డీఎన్ఏ కరోనా వ్యాక్సిన్‌గా రికార్డులకెక్కుతుంది. టీకాకు ఆమోదం లభిస్తే రెండు నెలల్లో జైకోవ్-డిని మార్కెట్లోకి తీసుకొస్తామని జైడస్ ప్రకటించింది. ఏటా 24 కోట్ల డోసులను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నది.