Zomato : ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటో (Zomato) క్విక్ డెలివరీ సేవలను మళ్లీ నిలిపేసింది. ప్రారంభించిన నాలుగు నెలలకే క్విక్ డెలివరీ సేవలు క్లోజ్ అయ్యాయి. ఫుడ్ డెలివరీ విభాగంలో పోటీ పెరుగుతున్న తరుణంలో గతంలో పరిచయం చేసిన ఈ క్విక్ డెలివరీ సర్వీసును నాలుగు నెలల క్రితం జొమాటో తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ముందులా 10 నిమిషాలు కాకుండా.. ఈసారి రెండు కిలోమీటర్ల పరిధిలో 15 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ చేయాలని నిర్ణయించి ఆ మేరకు సేవలు అందించింది.
ఇప్పుడు బెంగళూరు, గురుగ్రామ్, హైదరాబాద్, ముంబై తదితర నగరాల్లో ఈ క్విక్ డెలివరీ సేవలు అందుబాటులో లేకుండా పోయాయి. అయితే రెండోసారి కూడా క్విక్ డెలివరీ సేవలను నిలిపివేయడానికి కారణం ఏమిటని ఓ జాతీయ మీడియా సంస్థ ప్రశ్నించగా జొమాటో స్పందించలేదని తెలిసింది. జమాటో 2022లో కూడా ఇన్స్టాంట్ డెలివరీ సేవలను ప్రారంభించింది. బెంగళూరుతోపాటు దేశ రాజధాని ప్రాంతంలో ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది. రెండు కిలోమీటర్ల పరిధిలో 10 నిమిషాల్లో డెలివరీ సేవలు అందించింది.
అయితే 2023లో ఈ సేవలను నిలిపేసింది. ఈ ఏడాది జనవరిలో రెండు కిలో మీటర్ల పరిధిలో 15 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ ఇచ్చేలా క్విక్ డెలివరీ సేవలను పునఃప్రారంభించింది. అయితే నాలుగు నెలలకే మరోసారి ఆ సేవలను నిలిపేసింది.