Sridhar Vembu : తమిళనాడు (Tamil Nadu) లో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ క్రమంలో జోహో సహ వ్యవస్థాపకుడు (Zoho Co Founder) శ్రీధర్ వెంబు (Sridhar Vembu) కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని అన్నారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంఖ్యాబలం సరిపోతలేదని, ఇలాంటి పరిస్థితిలో వివిధ పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా అది స్థిరంగా ఉండదని వ్యాఖ్యానించారు.
‘సంఖ్యా బలం సరిపోతున్నట్లు కన్పించడం లేదు. ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటైనా వివిధరకాల ఒత్తిళ్లు, అంతర్గత విభేదాలవల్ల అది స్థిరంగా ఉండే అవకాశం లేదు. తమిళనాడు మెరుగైన పాలనకు అర్హమైంది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి మరోసారి ఎన్నికలు నిర్వహించడం అత్యుత్తమ మార్గం. అయితే ఈసారి ఓటుకు నోటు పద్ధతి అరికట్టేలా కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పుడు ప్రజల నిజమైన తీర్పు ఎవరి పక్షాన ఉందో స్పష్టమవుతుంది’ అని చెప్పారు. ‘విజయ్ భారీ మెజార్టీతో తిరిగివస్తారని నేను భావిస్తున్నా. ఒకవేళ డీఎంకే, అన్నాడీఎంకేలు విజయ్‌ని అడ్డుకోవాలనుకుంటే.. అవి రెండు కలిసి పోటీకి దిగాలి’ అన్నారు.
బీజేపీ మాత్రం ఒంటరిగానే పోటీ చేయాలని సూచించారు. ఆ పార్టీకి ఒక్క సీటు రాకపోయినా సరే రాష్ట్రంలో ఆ పార్టీకి అది కొత్త అధ్యాయం అవుతుందని చెప్పారు. ప్రజలే మళ్లీ ఒక కొత్త నిర్ణయం తీసుకునే అవకాశం కల్పించాలి’ అని శ్రీధర్ వెంబు రాసుకొచ్చారు. కాగా 234 సీట్లకుగాను గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ టీవీకే 108 స్థానాల్లో గెలుపొందింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 118 స్థానాల మెజార్టీ మార్క్‌ను చేరుకోలేకపోయింది. ఈ క్రమంలో సంఖ్యా బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తోంది. కానీ కాంగ్రెస్ మినహా మరే పార్టీ మద్దతు ప్రకటించలేదు.