Zakir Naik : భారత్ నుంచి పారిపోయి మలేషియాలో ఆశ్రయం పొందుతున్న వివాదాస్పద మత బోధకుడు జకీర్ నాయక్ (Zakir Naik) అప్పగింతపై మలేసియా నుంచి సానుకూల సంకేతాలు వెలువడ్డాయి. జకీర్ నాయక్‌కు సంబంధించి తగిన ఆధారాలు సమర్పిస్తే.. భారత్ చేసిన అప్పగింత అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంటామని మలేషియా ప్రధాని (Malaysia Prime Minister) అన్వర్ ఇబ్రహీం (Anwar Ibrahim) చెప్పారు.
భారత్-మలేసియా (India-Malaysia) ద్వైపాక్షిక సంబంధాల ఉన్నతీకరణకు జకీర్ నాయక్ అంశం అడ్డుపడొద్దని ఇబ్రహీం వ్యాఖ్యానించారు. మంగళవారం ప్రధాని మోదీతోపాటు భారత బృందంతో జరిగిన చర్చల్లో జకీర్ నాయక్ అంశం ప్రస్తావనకు రాలేదని ఆయన తెలిపారు. కొన్నేళ్ల క్రితం ప్రధాని మోదీ ఇతర వేదికలపై ఈ అంశాన్ని లేవనెత్తిన విషయాన్ని గుర్తుచేశారు. ఆధారాలు సమర్పిస్తే తగిన చర్యలు తీసుకుంటామని, ఆ దిశగా ఎలాంటి సలహాలు, సూచనలు చేసినా స్వీకరిస్తామని ఇబ్రహీం చెప్పారు.
‘ఉగ్రవాదాన్ని ఉపేక్షించబోం. కఠినంగా వ్యవహరిస్తాం. ఉగ్రవాదాన్ని అణచివేయటంతోపాటు పలు అంశాల్లో భారత్‌తో కలిసి పనిచేస్తున్నాం. మరింత సహకారం, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతాన్ని ఈ ఒక్క కేసు (జకీర్ నాయక్ అంశం) నిరోధించాలని నేను అనుకోను” అని ఇబ్రహీం వ్యాఖ్యానించారు. భారత్, మలేసియాలు తమ సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి చేరేలా చేశాయన్నారు. కాగా అన్వర్ ఇబ్రహీం సోమవారం నుంచి భారత్‌లో పర్యటిస్తున్నారు.