ఇండోర్, జూలై 10: భోపాల్‌లో 90 డిగ్రీల మలుపుతో ఐష్బాగ్ రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ) నిర్మాణంతో అపఖ్యాతి పాలైన బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ తాజాగా జెడ్ ఆకృతిలో ఇండోర్‌లో నిర్మిస్తున్న మరో వంతెన స్థానికులతోపాటు ట్రక్కు డ్రైవర్లను, పారిశ్రామికవేత్తలను హడలెత్తిస్తున్నది. ఇండోర్‌లోని లక్ష్మీనగర్ నుంచి భగీరథ్‌పురా మీదుగా పోలో గ్రౌండ్‌ని కలిపే ఈ ఆర్వోబీని మధ్యప్రదేశ్ పీడబ్ల్యూడీ చేపట్టింది. ఈ వంతెనలో 90 డిగ్రీల కోణంలో జెడ్ ఆకృతిలో రెండు మలుపులు ఉండడం సర్వత్రా విమర్శకు దారితీస్తున్నది.
ఈ ఆర్వోబీ డిజైన్‌పై ఆందోళన చెందుతున్న ఇండోర్ ఎంపీ శంకర్ లాల్వాణీ రాష్ట్ర పీడబ్ల్యూడీ మంత్రికి దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లారు. ప్రజల నుంచి వస్తున్న తీవ్ర విమర్శలతో పునరాలోచనలో పడిన అధికారులు ఆర్వోబీ డిజైన్‌పై సమీక్షలు జరుపుతున్నారు.
అవసరమైన దిద్దుబాటు చర్యలు చేపడతామని ఈఈ గుర్మీత్ కౌర్ తెలిపారు. దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ బీజేపీ ప్రభుత్వంపై వ్యంగ్యాస్ర్తాలు సంధించింది. భోపాల్‌లో 90 డిగ్రీల మలుపుతో నిర్మించిన వంతెన విజయవంతమైన తర్వాత ఇండోర్‌కు మరో ప్రత్యేకమైన వింత నమూనాను రాష్ట్ర ప్రభుత్వం అందచేస్తోందంటూ కాంగ్రెస్ విమర్శించింది.