న్యూఢిల్లీ, మే 19: పాకిస్థాన్‌కు గూఢచర్యం చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ట్రావెల్ విత్ జో పేరిట యూట్యూబ్ చానల్ నడుపుతున్న జ్యోతి మల్హోత్రకు సంబంధించి విస్తుపోయే విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి జరగడానికి కొన్ని నెలల ముందు ఆమె పహల్గాంకు వెళ్లినట్టు తేలింది. అక్కడ తీసిన వీడియోలను పాక్‌లోని ఐఎస్ఐ అధికారులకు ఆమె చేరవేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే ఉగ్రదాడికి కొన్ని రోజుల ముందు పాకిస్థాన్‌కి కూడా జ్యోతి ప్రయాణించినట్లు హిసర్ పోలీసులు వెల్లడించారు. ఓ పాకిస్థానీ పౌరుడితో తరచూ సంప్రదింపులు జరిపిన జ్యోతి ఐఎస్ఐకి అస్త్రంగా మారిపోయిందని హిసర్ ఎస్పీ శశాంక్ కుమార్ సావన్ తెలిపారు.
స్పాన్సర్డ్ ట్రిప్స్‌పై ఆమె పాక్‌కు వెళ్లేదని, పహల్గాం దాడికి ముందు ఆమె పాక్‌కు వెళ్లిందని, రెండు ఘటనలకు లంకె ఏమైనా ఉందా అన్న విషయమై దర్యాప్తు జరుగుతోందని ఆయన చెప్పారు. పాకిస్థాన్‌కు రెండుసార్లు వెళ్లిన జ్యోతి అక్కడి ఇన్ఫ్లూయెన్సర్లతోపాటు పాకిస్థాన్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ల(పీఐఓలు)తో కూడా టచ్‌లో ఉన్నట్లు ఆయన చెప్పారు. ఢిల్లీలోని పాక్ హై కమిషన్ అధికారి అహ్సాన్ ఉర్ రహీం అలియాస్ డానిష్‌ని 2023లో కలుసుకున్నానని, అతను ఇచ్చిన నంబర్ల ఆధారంగా తన పాక్ పర్యటనలో ఐఎస్ఐ అధికారులను కలుసుకున్నట్లు ఆమె ఒప్పుకుందని పోలీసులు తెలిపారు. ఆమె మొబైల్ ఫోన్, లాప్టాప్ నుంచి అనుమానాస్పద సమాచారాన్ని సేకరించినట్లు హిసర్ డీఎస్పీ కమల్జీత్ తెలిపారు. కాగా, తన కుమార్తె పాక్‌కు వెళ్లి యూట్యూబ్ కోసం వీడియోలు చేసిందని జ్యోతి తండ్రి హరీశ్ మల్హోత్రా తెలిపారు. ఆమె ఎన్నిసార్లు పాక్‌కు వెళ్లిందో తనకు తెలియదని, అయితే తగిన అనుమతులతోనే ఆమె అక్కడకు వెళ్లిందని ఆయన ఏఎన్ఐ వార్తాసంస్థకు తెలిపారు.
జ్యోతి మల్హోత్ర 2023లో హైదరాబాద్‌ను సందర్శించినట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది. తెలుగు రాష్ర్టాలను కలిపే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన కార్యక్రమాన్ని జ్యోతి వీడియో తీసి తన యూట్యూబ్ చానల్లో పోస్టు చేసింది. ఈ కార్యక్రమంలో అప్పటి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పాల్గొన్నారు. జ్యోతి హైదరాబాద్ సందర్శన కేవలం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభోత్సవానికి మాత్రమే పరిమితమా లేక మరే ఇతర కారణాలేమైనా ఉన్నాయా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఢిల్లీలోని పాక్ హైకమిషన్ వద్ద కేక్ డెలివరీ చేసిన వ్యక్తితో జ్యోతి మల్హోత్రా ఉన్న వీడియో తాజాగా వెలుగుచూసింది. కేక్ డెలివరీ చేస్తున్న వ్యక్తి వీడియోతోపాటు అదే డెలివరీ బాయ్‌తో జ్యోతి ఉన్న వీడియోను ఓ ఎక్స్ యూజర్ తాజాగా పోస్టు చేశాడు. జ్యోతి మల్హోత్రకు చెందిన యూట్యూబ్ చానల్లో ఉన్న ఒక వీడియోలో జ్యోతితో మాట్లాడుతూ ఆ వ్యక్తి కనిపించాడు. దీంతో గూఢచర్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జ్యోతికి, పాక్ హై కమిషన్ వద్ద కేక్ డెలివరీ చేసిన వ్యక్తికి ఉన్న సంబంధం ఏమిటన్న విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.