న్యూఢిల్లీ: యూట్యూబ్ ఇన్ఫ్లూయెన్సర్ రణ్వీర్ అల్లాబదియా(Ranveer Allahbadia).. ఇవాళ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దేశవ్యాప్తంగా నమోదు అయిన కేసులన్నీ క్లబ్ చేయాలని కోరుతూ అతను అత్యున్నత న్యాయస్థానాన్ని కోరాడు. ఓ షోలో పేరెంట్స్ సెక్స్ గురించి ఓ కాంటెస్టెంట్‌ను అల్లాబదియా ప్రశ్న వేశాడు. దానిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. కేంద్ర సర్కారు ఆదేశాలతో ఆ వీడియో క్లిప్‌ను యూట్యూబ్ నుంచి తొలగించారు.
అయితే వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు ప్రదేశాల్లో అల్లాబదియాపై కేసులు నమోదు అయ్యాయి. చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ముందుకు అల్లాబదియా అప్పీల్ వెళ్లింది. అల్లాబదియాపై నమోదు అయిన కేసులన్నీ ఒక్కటి చేయాలని కోరుతూ అతని తరపున లాయర్ అభినవ్ చంద్రచూడ్ సుప్రీంకోర్టును కోరారు. ఈ పిల్ మరో రెండుమూడు రోజుల్లో విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు లాయర్ అభినవ్ వెల్లడించారు.
అస్సాం పోలీసులు సమన్లు ఇచ్చిన నేపథ్యంలో అర్జెంట్‌గా తమ కేసును విచారించాలని కోరుతూ లాయర్ అభివన్ సుప్రీంను కోరారు. సామే రైనాకు చెందిన ఇండియాస్ గాట్ లేటెంట్ షోలో పేరెంట్స్ సెక్స్ గురించి అల్లాబదియా ప్రశ్న వేసిన విషయం తెలిసిందే. యూట్యూబర్ అల్లాబదియాతో పాటు అనేక మంది ఆ షో ఆర్టిస్టులపై కేసులు నమోదు అయ్యాయి. అల్లాబదియా కేసులో విచారణ తేదీని ముందే ఇచ్చేసినట్లు సుప్రీంకోర్టు చెప్పింది.