కోల్‌కతా: కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పశ్చిమ బెంగాల్ పర్యటన సందర్భంగా కోల్‌కతాలో ఆయనకు స్వాగతం పలికే బైక్ ర్యాలీని లీడ్ చేయాల్సిన బీజేపీ కార్యకర్త అనుమానాస్పదంగా మరణించాడు. కోల్‌కతాలోని చిత్పూర్-కాసిపోర్ ప్రాంతంలో 26 ఏళ్ల అర్జున్ చౌరాసియా అనే యువకుడు పాడుబడిన బిల్డింగ్‌లో సీలింగ్‌కు వేలాడుతూ శుక్రవారం కనిపించాడు. దీంతో తమ కార్యకర్తను అధికార టీఎంసీ హత్య చేసిందని బీజేపీ ఆరోపించింది. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారని, మృతుడి కాళ్లు నేలకు తగులుతూ ఉండటమే దీనికి కారణమని పేర్కొంది.
అర్జున్ చౌరాసియా చురుకైన కార్యకర్త అని, కోల్‌కతా బీజేపీ యువజన విభాగం ఉపాధ్యక్షుడని ఉత్తర కోల్‌కతా జిల్లా బీజేపీ అధ్యక్షుడు కళ్యాణ్ చౌబే తెలిపారు. హోం మంత్రి అమిత్ షాకు కోల్‌కతాలో స్వాగతం పలికేందుకు 200 మంది కార్యకర్తలతో ఎయిర్పోర్ట్ నుంచి నిర్వహించనున్న బైక్ ర్యాలీకి అర్జున్ నాయకత్వం వహించాలని గత రాత్రి తాము ప్లాన్ చేసినట్లు చెప్పారు. అయితే ఘోష్ బగాన్ రైల్వే యార్డ్‌లోని పురాతన భవనంలో శుక్రవారం ఉదయం సీలింగ్‌కు వేలాడుతున్న అతడి మృతదేహాన్ని కనుగొన్నట్లు మీడియాతో అన్నారు.
కాగా, బీజేపీ కార్యకర్త అర్జున్ చౌరాసియా అనుమానాస్పద మరణ వార్త గురించి తెలిసిన అమిత్ షా, కోల్‌కతాలో స్వాగత ర్యాలీని నిర్వహించవద్దని బీజేపీ నేతలకు సూచించారు. కోల్‌కతా పర్యటనలో భాగంగా మరణించిన బీజేపీ కార్యకర్త ఇంటికి ఆయన వెళ్లనున్నారు.
మరోవైపు బీజేపీ కార్యకర్తను హత్య చేసినట్లు ఆ పార్టీ చేసిన ఆరోపణలను టీఎంసీ ఖండించింది. స్థానిక బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య ఈ అంశంపై ఘర్షణ జరుగడంతో పోటాపోటీగా నిరసనకు దిగారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. ఆ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు. అయితే బీజేపీ కార్యకర్త అర్జున్ చౌరాసియాది ఆత్మహత్యా లేక రాజకీయ హత్యా అన్నది స్పష్టం కాలేదు. బీజేపీ కార్యకర్త అనుమానాస్పద మరణంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.