Congress Protest | కాంగ్రెస్ ఆందోళనలతో ఢిల్లీ నగరం అట్టుడికిపోయింది. ఒకవైపు యూత్ కాంగ్రెస్.. మరోవైపు మహిళా కాంగ్రెస్ నిరసన ర్యాలీలు, బైఠాయింపులతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అదానీ విషయంలో యూత్ కాంగ్రెస్, నిరుద్యోగం విషయంలో మహిళా కాంగ్రెస్ నేతలు ఆందోళనలు జరిపారు. అదానీ వివాదాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నది. ఈ విషయమై కాంగ్రెస్ నేతలు ప్రభుత్వాన్ని నిత్యం ఏదో ఒక రూపంలో ముట్టడిస్తూ వస్తున్నారు.
అదానీ గ్రూప్, హిండెన్బర్గ్ల నివేదికపై కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ యూత్ కాంగ్రెస్ నాయకులు పార్లమెంటు నుంచి మెయిన్ రోడ్డు వరకు నిరసన చేపట్టారు. అనంతరం శాస్త్రి భవన్ ఎదుట ఆందోళనకు దిగింది. అదానీ కేసులో జేపీసీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు బారికేడ్లు దాటుకునే ప్రయత్నం చేశారు. దాంతో వారిని నిలువరించేందుకు పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేశారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదే సమయంలో జంతర్ మంతర్ వద్ద మహిళా కాంగ్రెస్ నేతలు బైఠాయించారు. పెద్ద సంఖ్యలో మహిళా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, తదితర సమస్యలపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.