న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో (Karnataka Election results) కాంగ్రెస్ పార్టీ గెలుపుపై ఆ పార్టీ సీనియర్ నేత పీ చిదంబరం స్పందించారు. ‘మీ ఆధిపత్య సిద్ధాంతాలు పని చేయలేదు’ అని బీజేపీని విమర్శించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో నిర్ణయాత్మక తీర్పు ఇచ్చిన ఆ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక అభినందనలు, హృదయపూర్వక ధన్యవాదాలని తెలిపారు. కర్ణాటక ఎన్నికలు ఆ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల కంటే ఎక్కువని అన్నారు. కర్ణాటకలో బీజేపీ ఓటమి భారత రాజ్యాంగ ప్రాథమిక విలువలను సమర్థించడమని అభివర్ణించారు. అలాగే బీజేపీ ఆధిపత్య సిద్ధాంతాలు, వివక్ష, పక్షపాతం వల్ల జరిగే నష్టాన్ని కర్ణాటక ప్రజలు తమ తీర్పుతో నిలువరించారని చిదంబరం ట్వీట్ చేశారు.
కాగా, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పలితాల్లో కాంగ్రెస్ పార్టీ తొలి నుంచి ఆధిక్యంలో నిలిచింది. ఆ పార్టీ ఆశించిన దాని కంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధించింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు గాను ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ సంఖ్య 113ను కాంగ్రెస్ పార్టీ దాటింది. 136 స్థానాల్లో లీడ్‌లో ఉంది.
మరోవైపు కర్ణాటకలో మరోసారి అధికారంలోకి రావాలని భావించిన బీజేపీ ఆశలు ఆవిరయ్యాయి. ఆ పార్టీ కేవలం 64 స్థానాలకే పరిమితమైంది. దీంతో సీఎం బసవరాజ్ బొమ్మై పార్టీ ఓటమిని అంగీకరించారు. కర్ణాటకలో ఓటమితో దక్షిణ భారత్‌లో ఉనికిని బీజేపీ కోల్పోయింది. కాగా, హంగ్ ఏర్పడితే కింగ్‌మేకర్ కావచ్చని భావించిన హెచ్డీ కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్ 20 సీట్లతో సరిపెట్టుకున్నది.
Warm congratulations and sincere thanks to the people of Karnataka for delivering a decisive verdict
This election was more than an election to a State Assembly. It was about upholding the fundamental values of the Indian Constitution and stopping the damage done by supremacist…
— P. Chidambaram (@PChidambaram_IN) May 13, 2023