తిరుమల : వైకుంఠ ద్వార దర్శనాలను ( Vaikuntha Dwara Darshans ) అద్భుతంగా జరిపామని టీటీడీ చైర్మన్ (TTD Chairman) బీఆర్ నాయుడు ( BR Naidu) వెల్లడించారు. టీటీడీ ఏర్పాటుచేసిన సౌకర్యాలపై భక్తులు హర్షం వ్యక్తం చేశారని చైర్మన్ తెలిపారు.
వైకుంఠ ద్వార దర్శనాల విజయవంతంపై తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఏఈవో వెంకయ్య చౌదరితో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. పదిరోజుల్లో 7.83 లక్షల మంది భక్తులు వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకున్నారని, హుండీకి రూ.41.14 కోట్ల ఆదాయం ( Income ) వచ్చిందని వివరించారు.
శుక్రవారం రికార్డు స్థాయిలో 83 వేల మంది స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు. భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందజేశామని , భక్తుల రద్దీని ఏఐ కమాండ్ కంట్రోల్ రూం ద్వారా నిరంతరం పర్యవేక్షణ జరిపామని పేర్కొన్నారు. సామాన్య భక్తులు సౌకర్యవంతంగా స్వామివారిని దర్శించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లతో పాటు అవసరమైన వసతి గదుల కేటాయింపు చేశామని అన్నారు.
ఉద్యావనం విభాగం ఆధ్వర్యంలో ఆలయ ఆవరణలో రంగనాయక ఆలయ సెట్ భక్తులకు విశేషంగా ఆకట్టుకుందని తెలిపారు. ఇందుకు అవసరమైన 50 టన్నుల సాంప్రదాయ పుష్కాలు, 10 టన్నుల ఫలాలు, 4 టన్నుల కట్ ఫ్లవర్స్‌తో డెకోరేషన్ చేశామన్నారు. కల్యాణ కట్టలో 2.06 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారని చైర్మన్ వివరించారు.