Woman Molest | భువనేశ్వర్: బీజేపీ పాలిత ఒడిశాలోని ఫతేగఢ్‌లో గత ఆదివారం దారుణం జరిగింది. ఒక యువతిపై ఆమెకు కాబోయే భర్త ముందే కొందరు లైంగిక దాడి చేశారు. పోలీసుల కథనం ప్రకారం, ఈ నెల 20న సాయంత్రం బాధితులిద్దరూ రామాలయం నుంచి తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో ముగ్గురు యువకులు వారిని అడ్డుకున్నారు. వారిద్దరినీ సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లి, యువకుడిని కత్తితో బెదిరించి, అతడి సమక్షంలోనే ఆ యువతి (21)పై లైంగిక దాడి చేశారు. ఈ దారుణాన్ని మొబైల్ ఫోన్లో చిత్రీకరించి, సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశారు. బాధితులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
సామాజిక మాధ్యమాలకు కేంద్రం ఆదేశం
న్యూఢిల్లీ: విమానయాన రంగాన్ని నకిలీ బాంబు బెదిరింపులు కుదిపేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సామాజిక మాధ్యమాలను హెచ్చరించింది. ఐటీ చట్టం ప్రకారం నేరం జరగకుండా నిరోధించేందుకు చేపట్టాల్సిన సమంజసమైన చర్యలను చేపట్టాలని ఆదేశించింది. ఈ చర్యలను చేపట్టకపోతే, ఈ చట్టం ప్రకారం మధ్యవర్తిత్వ వేదికలుగా పొందుతున్న రక్షణ వర్తించదని స్పష్టం చేసింది. నకిలీ బాంబు బెదిరింపుల కారణంగా విమాన ప్రయాణికులు, భద్రతా సంస్థలు ప్రభావితమవుతున్నాయని తెలిపింది. ఫార్వార్డింగ్, రీ షేరింగ్, రీ పోస్టింగ్, రీ ట్వీటింగ్ ఆప్షన్ల వల్ల నకిలీ బాంబు బెదిరింపుల వ్యాప్తిని నియంత్రించే పరిస్థితి లేదని తెలిపింది. ఐటీ చట్టం, 2000; ఐటీ రూల్స్, 2021 ప్రకారం ప్రజా శాంతిభద్రతలపై ప్రభావం చూపి ంచే తప్పుడు సమాచారాన్ని తొలగించాలని ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఆదేశించింది. శనివారం గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో పది హోటళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి.