న్యూఢిల్లీ : టైప్-1, టైప్-2 మధుమేహంతో బాధపడే వారికి ఆకస్మిక గుండెపోటుతో మరణించే ముప్పు ఎక్కువగా ఉంటుందని తాజా అధ్యయనం వెల్లడించింది. 50 ఏళ్ల లోపు వయసు వారికి ఈ ప్రమాదం మరింత ఎక్కు వ అని తేలింది. డెన్మార్క్‌లో 2010లో మొత్తం 54,028 మంది మరణించగా, వీరిలో 6,862 మంది ఆకస్మికంగా గుండెపోటు వల్ల మరణించినట్లు పరిశోధకులు నిర్ధారించారు. ఈ అధ్యయనం ‘యూరోపియన్ హార్ట్ జర్నల్’లో ప్రచురితమైంది.
టైప్-1 మధుమేహంతో బాధపడేవారు హఠాత్తుగా గుండెపోటు వల్ల మృతి చెందే అవకాశం సాధారణ ప్రజానీకం కన్నా 3.7 రెట్లు ఎక్కువగా ఉంటుంది. టైప్-2 మధుమేహంతో బాధపడే వారికి ఈ అవకాశం 6.5 రెట్లు అధికం. వయసు 50 ఏళ్ల లోపుగల వారికి ఈ ముప్పు ఏడు రెట్లు ఎక్కువ.