న్యూఢిల్లీ: మన రైల్వే రిజర్వేషన్ ప్రయాణాలు హఠాత్తుగా రద్దు చేసుకొని మరో తేదీకి మార్చుకోవాల్సి వస్తే ఉసూరుమంటూ అప్పటికే బుక్ చేసుకున్న టికెట్లను రద్దు చేసి కొత్త టికెట్లను బుక్ చేస్తుంటాం. దీని కారణంగా డబ్బు, సమయం వృథా అవుతుంది. అయితే ఇక నుంచి అలాంటి బాధలు లేకుండా ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. క్యాన్సిలేషన్ల పేరిట ఇకపై మీరు ఎలాంటి డబ్బు నష్టపోకుండా మీకు కావాల్సిన తేదీలకు టికెట్లను మార్చుకోవచ్చునని ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి నుంచి అమలులోకి వచ్చే ఈ విధానంలో ఖరారైన తమ రైలు రిజర్వ్ టికెట్ల తేదీలను ఎలాంటి అదనపు రుసుం లేకుండా మార్చుకోవచ్చునని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ‘పాత విధానం అనుచితమైనది. ప్రయాణికుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంది’ అని ఆయన పేర్కొన్నారు. దీంతో ఇకపై ప్రయాణికులకు అనుగుణంగా స్నేహపూర్వక మార్పులను అమలు చేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు ఆయన చెప్పారు. అయితే మార్చిన కొత్త తేదీ నాటికి కన్ఫర్మ్ టికెట్ లభిస్తుందన్న హామీ లేదని, అది సీటు/బెర్త్ లభ్యత ఆధారంగా ఉంటుందని తెలిపారు.