న్యూఢిల్లీ: హిందూ రాష్ట్రం గురించి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని యోగా గురువు రామ్‌దేవ్ బాబా అన్నారు. దేశంలోని ముస్లింలకు లేదా క్రైస్తవులకు దీని వల్ల ఎలాంటి ముప్పు లేదని, మన పూర్వీకులు ఒక్కరే అని స్పష్టం చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది. (Ramdev Baba) 2009లో ఉత్తరప్రదేశ్‌లోని ఇస్లామిక్ విద్యాసంస్థ (మదర్సా)ను సందర్శించిన సందర్భాన్ని రామ్‌దేవ్ బాబా గుర్తుచేసుకున్నారు. ‘హరిద్వార్ సమీపంలో డియోబంద్ ఉంది. 2009లో నన్ను అక్కడికి ఆహ్వానించినప్పుడు నేను వారితో ఇలా అన్నాను. ‘మన మతాలు వేరుగా ఉండవచ్చు, కానీ మన పూర్వీకులు ఒక్కరే. ‘హిందూ రాష్ట్రం’ అనే భావన పట్ల ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. మనందరి పూర్వీకులు సనాతన హిందూ ఆర్య- వైదికులే. ఈ విషయం మన కళ్ల ముందే స్పష్టంగా లిఖించి ఉన్నది’ అని అన్నారు.
కాగా, దేశంలోని మైనారిటీ వర్గాలకు రామ్‌దేవ్ బాబా కొన్ని సూచనలు చేశారు. ‘కొందరు ఇలా అడుగుతుంటారు: ‘ఒకవేళ హిందూ రాష్ట్రం ఏర్పడితే ముస్లింలు ఎక్కడికి వెళ్తారు?’ అని. దీనికి సమాధానం చాలా సులభం. మీ పూర్వీకుల సంప్రదాయాలను స్వీకరించండి. మీరు గడ్డం పెంచుకోవచ్చు లేదా తీసివేయవచ్చు. మీకు నచ్చిన దుస్తులు ధరించవచ్చు. కానీ మీ పూర్వీకుల లాంటి వ్యక్తిత్వాన్ని మాత్రం కలిగి ఉండండి. హిందుస్థాన్‌లో ముస్లింలకు గానీ, క్రైస్తవులకు గానీ ఎలాంటి ప్రమాదం లేదు’ అని అన్నారు.
మరోవైపు రామ్‌దేవ్ బాబా చేసిన ఈ వ్యాఖ్యలు వివాదానికి దారి తీసింది. రాజకీయ నేతలు తీవ్రంగా విమర్శించారు. అందరూ సనాతనులే అయినప్పుడు ‘ఇన్ని విభజనలు సృష్టించడానికి’ ఎందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ ప్రశ్నించారు.
అయితే ‘అత్యవసరమైన సవాళ్ల’ నుంచి దేశ ప్రజల దృష్టిని మళ్లించే వ్యూహంలో భాగంగానే యోగా గురువు ఈ వ్యాఖ్యలు చేశారని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నేత ఫఖ్రుల్ హసన్ చాంద్ ఆరోపించారు. దేశ సమస్యల బాధ్యత నుంచి తప్పించుకునేందుకు బీజేపీ ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి అంశాలను తెరపైకి తెస్తోందని విమర్శించారు. ‘బాబా రామ్‌దేవ్ వంటి వారు దేశానికి సంబంధించిన అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించవద్దని నేను వారికి సూచిస్తున్నా’ అని ఆయన అన్నారు.