Year Round 2024 | చరిత్ర కాలగర్భంలో మరో సంవత్సరం కలిసిపోనున్నది. మరో 24 గంటల్లో కొత్త వసంతం అడుగు పెట్టనున్నది. గత 12 నెలల కాలంలో కీలక ఘటనలు చోటు చేసుకున్నాయి. సార్వత్రిక ఎన్నికలతోపాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 11 ఏండ్ల తర్వాత ఐసీసీ క్రికెట్ ట్రోఫీని టీం ఇండియా సొంతం చేసుకున్నది. ఇటువంటి చిరస్మరణీయ తీపి గుర్తులెన్నో ఉన్నాయి.. పది ప్రధాన ఘటనలు.. వాటిలో సానుకూల పరిణామాలు, ప్రతికూల అంశాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందామా..!
ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో 2024లో ఏడు దశల్లో విజయవంతంగా సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 19 నుంచి జూన్ ఒకటో తేదీ వరకూ 44 రోజుల పాటు జరిగిన ఎన్నికల సంరంభంలో దేశ ప్రజలు 543 మంది ఎంపీలను గెలుచుకున్నారు. 97.9 కోట్ల మంది ఓటర్లకు 64.64 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
జూన్ నాలుగో తేదీన ప్రకటించిన ఫలితాల్లో బీజేపీ సారధ్యంలోని ఎన్డీఏ మూడోసారి విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఎన్డీఏకు 293 సీట్లు రాగా, ప్రతిపక్ష ఇండియా బ్లాక్’కు 234 సీట్లు వచ్చాయి. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని అయిన తొలి నేత నరేంద్రమోదీయే.
ఈ ఏడాది కాలంలో హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఆంధ్రప్రదేశ్, జమ్ముకశ్మీర్ అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. వివిధ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా ఆశ్చర్యకర ఫలితాలనిచ్చాయి. హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు భిన్నంగా బీజేపీ విజయం సాధించింది. మహారాష్ట్రలోనూ బీజేపీ-శివసేన (ఏక్ నాథ్ షిండే) – ఎన్సీపీ (అజిత్ పవార్)లతో కూడిన మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ తన అధికారాన్ని కాపాడుకుంది. ఒడిశాలో 24 ఏండ్ల బిజూ జనతాదళ్ పార్టీ పాలనకు చెక్ పెట్టి బీజేపీ చారిత్రక విజయం సాధించింది. జార్ఖండ్ రాష్ట్రంలో ప్రతిపక్ష బీజేపీ సారధ్యంలోని ఎన్డీఏ కూటమిపై ఇండియా బ్లాక్ ఘన విజయం సాధించింది.
2018 తర్వాత తొలిసారి జమ్ముకశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. 2018లో పీడీపీ-బీజేపీ కూటమి సర్కార్ కుప్పకూలిన తర్వాత రాష్ట్రపతి పాలన విధించారు. 2019లో జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక హోదానిచ్చే 370 అధికరణాన్ని తొలగించింది కేంద్రం. జమ్ముకశ్మీర్ కు కేంద్ర పాలిత ప్రాంత హోదా కల్పించింది. 370 అధికరణం రద్దు చేసిన తర్వాత జమ్ము కశ్మీర్ అసెంబ్లీకి జరిగిన తొలి ఎన్నికలు ఇవి.
2024లో ఇద్దరు ముఖ్యమంత్రులు అరెస్టయ్యారు. 2024 మార్చి 21న ఢిల్లీ సీఎంగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ను మనీ లాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం రద్దు చేసిన 2021-22 ఢిల్లీ మద్యం పాలసీలో అవకతవకలు జరిగాయని ఈడీ అభియోగం. సెప్టెంబర్ 13న సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో కేజ్రీవాల్ బయటకు వచ్చారు. జనవరి 31న మరో మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ను ఈడీ అరెస్ట్ చేసింది. దాదాపు ఐదు నెలల తర్వాత జూన్ 28న విడుదలయ్యారు.
నాలుగేండ్ల తర్వాత చైనా, భారత్ మధ్య సుదీర్ఘ కాలంగా 3440 కి.మీ పొడవునా పెండింగ్ లో ఉన్న సరిహద్దు వివాదంపై కొంత పురోగతి చోటు చేసుకుంది. హిమాలయ సరిహద్దుల్లో ఇరువైపులా పెట్రోలింగ్ చేయాలని చైనా, భారత్ మధ్య ఒప్పందం కుదిరింది.
టీం ఇండియా 12 ఏండ్ల తర్వాత టీ-20 ఐసీసీ ట్రోఫీ చాంపియన్ గా నిలిచింది. 2023 టీ-20 ఐసీసీ చాంపియన్ షిప్ టోర్నీలో రన్నరప్ గా నిలిచింది. ఈ ఏడాది జరిగిన టీ-20 టోర్నీలో సౌతాఫ్రికాపై జరిగిన ఫైనల్స్ మ్యాచ్‌లో ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఇండియన్ టీనేజర్ గుకేష్ దొమ్మరాజు ఈ నెల 12న చరిత్ర సృష్టించాడు. యువ చెస్ వరల్డ్ చాంపియన్ గా గెలిచారు. వరల్డ్ చాంపియన్ షిప్ టోర్నీలో చైనా ప్లేయర్ డింగ్ లిరెన్ పై విజయం సాధించాడు. 18 ఏండ్ల గుకేష్.. 18వ వరల్డ్ చెస్ చాంపియన్‌గా నిలిచాడు. 1985లో అప్పటి అనటోలి కార్పోవ్‌పై గ్యారీ కాస్పరోవ్ విజయం సాధించాడు.
ఈ ఏడాది పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్ లో భారత్ ఆరు పతకాలు గెలుచుకున్నది. ఐదు కాంస్య పతకాలు, ఒక వెండి పతకం గెలుచుకున్నది. జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా వెండి పతకం పొందాడు. షూటర్ మాను బాకర్ రెండు పతకాలతో చరిత్ర సృష్టించాడు. మరో ఇద్దరు షూటర్లు స్వపినిల్ కుసాలే, సరబ్ జోత్ సింగ్ చెరో కాంస్య పథకం గెలుచుకున్నాయి. పురుషుల హాకీ విభాగంలో సెమీ ఫైనల్స్ లో టాప్ లో నిలవడంతో కాంస్య పథకం, మెన్స్ 57 కిలోల ఫ్రీ స్టైల్ క్యాటగిరీలో రెజ్లర్ అమన్ షెహ్రావత్ మూడో స్థానంలో నిలిచాడు.
కోల్ కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో రెసిడెంట్ డాక్టర్‌పై లైంగిక దాడి, హత్య కేసు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆగస్టు తొమ్మిదో తేదీన దేశవ్యాప్తంగా నిరసన వెల్లువెత్తింది.
ఈ ఏడాది పలువురు ప్రముఖులను యావత్ దేశం కోల్పోయింది. పారిశ్రామికవేత్త రతన్ టాటా, సంగీత దర్శకులు ఉస్తాద్ జకీర్ హుస్సేన్, ఉస్తాద్ రషీద్ ఖాన్, నేపథ్య గాయని పంకజ్ ఉధాస్, ప్రఖ్యాత సినీ నిర్మాత శ్యామ్ బెనెగల్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు.
ముకేశ్ అంబానీ-నీతా అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ – రాధికా మర్చంట్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కొన్ని రోజుల పాటు జరిగిన వివాహ వేడుక కోసం రూ.5000 కోట్లు ఖర్చు చేశారు. పలువురు విదేశీ ప్రముఖులు, బాలీవుడ్ నటులు, హాలీవుడ్ నటులు, క్రికెటర్లు, వ్యాపారవేత్తలు హాజరయ్యారు.