Mata Vaishno Devi : శ్రీ మాతా వైష్ణో దేవి యాత్ర సెప్టెంబర్ 14 నుంచి పునఃప్రారంభం కానుంది. ఈ మేరకు శ్రీ మాతా వైష్ణోదేవి పుణ్యక్షేత్ర బోర్డు ఒక ప్రకటన చేసింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయిన యాత్ర.. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే సెప్టెంబర్ 14 నుంచి పునఃప్రారంభమవుతుందని బోర్డు తెలిపింది.
జమ్ముకశ్మీర్‌లోని రియాసి జిల్లాలో శ్రీ మాతా వైష్ణోదేవి యాత్ర నిలిచిపోయి ఇవాళ్టికి (శుక్రవారం) 18 రోజులైంది. ఆగస్టు 26న కత్రాలోని త్రికూట కొండలలోని అధ్కున్వారీలో క్లౌడ్‌బరస్ట్ కారణంగా పెద్ద ప్రమాదం సంభవించింది. కొండచరియలు విరిగిపడటంతో 34 మంది యాత్రికులు మరణించారు. 20 మంది గాయపడ్డారు. దాంతో యాత్ర తాత్కాలికంగా వాయిదా పడింది. అయితే ఆలయంలో పూజలు కొనసాగాయి.
కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. మూతపడ్డ ట్రాక్‌ను పునరుద్ధరిస్తున్నారు. ఆలయానికి వెళ్లే మార్గంలో మరమ్మతు పనులు చాలావరకు పూర్తయ్యాయి. అందుకే వాతావరణ పరిస్థితుల్లో మళ్లీ ఎలాంటి ప్రతికూలతలు లేకపోతే ఈ నెల 14 నుంచి యాత్రను పునఃప్రారంభించేందుకు ఆలయ బోర్డు సన్నాహాలు చేస్తోంది.