Delhi Rains | ఢిల్లీతోపాటు (Delhi) ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో యమునా నది (Yamuna River) మహోగ్రరూపం దాల్చింది. వరద (Floods) నీరు పోటెత్తడంతో ఆల్‌టైం రికార్డ్‌స్థాయికి చేరుకుంది. గురువారం ఉదయం 7 గంటలకు నదిలో 208.46 మీటర్ల మేర వరద ప్రవాహం ఉంది. ప్రమాదకర స్థాయి కంటే మూడు మీటర్లు ఎగువన ప్రవహిస్తోంది.
యమునా నది ఈ స్థాయిలో ప్రవహించడం చరిత్రలో ఇదే తొలిసారి. 1978లో నీటి మట్టం 207.49 మీటర్లకు చేరడంతో ఢిల్లీని భారీ వరదలు ముంచెత్తాయి. ఇప్పుడు ఆ రికార్డును కూడా దాటడంతో అటు అధికారులు, ఇటు ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఢిల్లీలోని పాత రైల్వే వంతెనే వద్ద యమునా నది నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. యమునా ఉప్పొంగడంతో సమీప ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ప్రధాన రహదారులన్నీ నదులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల ఇళ్లలోని నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సివిల్ లైన్స్ ప్రాంతంలో రింగ్ రోడ్డు పూర్తిగా నీటమునిగింది. కశ్మీరీ గేట్ – మంజు కా తిలాని కలిపే ప్రాంతంలో భారీగా వరద చేరి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ప్రాంతం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal), ఢిల్లీ అసెంబ్లీకి కేవలం 500 మీటర్ల దూరంలో మాత్రమే ఉంది.
మరోవైపు భారీ వర్షాలకు తోడు వరద ముప్పు పొంచి ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే సహాయక చర్యల నిమిత్తం 12 ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలను రంగంలోకి దింపారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
Also Read..
Bribe | రూ.50 వేలు లంచం తీసుకుంటు సీబీఐకి రెడ్హాండెడ్గా దొరికిన పోలీస్ ఆఫీసర్