దేశ రాజకీయాల్లో ‘గ్రోక్’ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ‘ఎక్స్’కు చెందిన ఈ చాట్‌బాట్.. అధికార పార్టీని ఇబ్బంది పెడుతూ.. విపక్ష పార్టీలకు రాజకీయ అస్త్రంగా మారుతున్నది. 11 ఏండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉండి చక్రం తిప్పుతున్న ప్రధాని మోదీకి, ఇతర అధికారపక్ష కీలక నాయకులకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నది.
Grok AI | హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): దేశ రాజకీయాల్లో ‘గ్రోక్’ సంచలనం రేపుతున్నది. ‘ఎక్స్’ (ట్విట్టర్)కు చెందిన ఈ చాట్ బాట్.. కేంద్రంలోని అధికార బీజేపీకి పంటి కింద రాయిలా ఇబ్బంది పెడుతున్నది. 11 ఏండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉండి చక్రం తిప్పుతున్న ప్రధాని మోదీకి, ఇతర అధికారపక్ష కీలక నాయకులకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. దాదాపు దశాబ్దంన్నర కాలంగా సోషల్ మీడియాలో, దేశంలోని ఇతర డిజిటల్ వేదికల్లో పెత్తనం చెలాయిస్తున్న బీజేపీ దూకుడుకు బ్రేకులు వేస్తోంది. బీజేపీ ఏకంగా ‘గో బ్యాక్ గ్రోక్’ ఉద్యమం ప్రారంభించిందంటేనే పరిస్థితి ఎలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.
టోకా అనే ఎక్స్ ఖాతా నుంచి కొన్ని రోజుల కింద వచ్చిన ఒక ప్రశ్నతో దేశంలో గ్రోక్ సంచలనాలు మొదలయ్యాయని చెప్తున్నారు. తన ఖాతాను అనుసరిస్తున్న వారిలో తనలాంటి భావజాలం ఉన్న పదిమందిని ఎంపిక చేయాలని టోకా కోరారు. గ్రోక్ ఆలస్యంగా సమాధానం ఇవ్వడంతో టోకా అసహనం వ్యక్తం చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో చాట్ బాట్ ఎదురుదాడి ప్రారంభించింది. టోకాకు హిందీలో సమాధానం ఇచ్చే క్రమంలో కొన్ని బూతులు వాడింది. దీంతో గ్రోక్ వ్యవహార శైలిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ తర్వాత అనేక అంశాలపై వరుసగా ప్రశ్నలు గుప్పిస్తూ దానిని రెచ్చగొట్టారు.
వాటన్నింటికీ ఏఐ చాట్ బాట్ నిర్మొహమాటంగా, ఘాటు వ్యాఖ్యలతో సమాధానాలు ఇస్తుండడంతో ప్రశ్నల వరద పెరిగింది. ఈ క్రమంలో కొందరు ప్రధాని మోదీ, బీజేపీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్‌పై అడిగిన ప్రశ్నలకు గ్రోక్ ఇచ్చిన సమాధానాలు సంచలనంగా మారాయి. అప్పటి నుంచి రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. వాస్తవానికి గ్రోక్ మొదటి నుంచి ఇలాంటి సమాధానాలు ఇస్తున్నదని నిపుణులు చెప్తున్నారు. మస్ ఎవరు? అని ఒకరు ప్రశ్నించగా.. ఎక్స్‌లో అత్యధిక నకిలీ వార్తలు సృష్టించే వ్యక్తిగా అభివర్ణించింది. తన సృష్టికర్తపైనే ఘాటు వ్యాఖ్యలు చేసింది.
రాజకీయ ప్రశ్నలకు గ్రోక్ ఇస్తున్న సమాధానాలు సంచలనం రేపుతున్నాయి. ముఖ్యంగా ప్రధాని మోదీ, బీజేపీ నేతల మీద అడుగుతున్న ప్రశ్నలకు గ్రోక్ ఇస్తున్న సమాధానాలు కమలనాథులకు మింగుడు పడటం లేదు. మోదీ ప్రధాని అయ్యాక నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌ల గురించి విశ్లేషించాలని కోరగా.. మోదీ మీడియా ముందుకు రావడం లేదని, మాట్లాడే పనిని అమిత్ షాకు అప్పగించారంటూ సమాధానం ఇచ్చింది. అంతేకాదు మోదీ ఇచ్చే ఇంటర్వ్యూలన్నీ స్రిప్టెడ్ (ముందే సిద్ధం చేసుకున్న ప్రశ్న, జవాబులు) గా అనిపిస్తున్నాయని వ్యాఖ్యానించింది. దీంతో గ్రోక్ చుట్టూ రాజకీయాలు తిరగడం మొదలయ్యాయి. దేశంలో అత్యధికంగా నకిలీ వార్తలు ఎవరు ప్రచారం చేస్తున్నారని ఒకరు ప్రశ్నించగా.. దేశంలోని అనేక ప్రముఖ మీడియా సంస్థల పేర్లను, వాటిల్లోని ముఖ్య అధికారుల పేర్లను చెప్పింది. ప్రధాన మీడియా సంస్థలపై బీజేపీ ప్రభావం గురించి అడగగా.. మోదీతో సన్నిహితంగా ఉన్న అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ పెద్దలు పెద్దపెద్ద మీడియా సంస్థలకు అధిపతులుగా ఉన్నారని పేరొన్నది.
బీజేపీ తనకు అనుకూల వార్తలను ప్రచారం చేసుకోవడంతో పాటు, వ్యతిరేక కథనాలను, వార్తలను తిప్పి కొట్టడానికి సంవత్సరానికి ఏకంగా 140 మిలియన్ డాలర్లను ఖర్చు చేస్తున్నదని సమాధానం ఇచ్చింది. ముఖ్యంగా 2014 నుంచి విమర్శకుల గొంతులను నొకుతున్నట్టు తెలిపింది. మత విద్వేషాలను వ్యాప్తి చేసినందుకు ఏ రాజకీయ నాయకులను అరెస్టు చేస్తారని ఓ నెటిజన్ అడగగా.. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ వంటి వారు మతవిద్వేషాలను ఎకువగా ప్రచారం చేస్తున్నారని గ్రోక్ పేరొన్నది. దీంతో గ్రోక్ సమాధానాలపై విసృ్తతంగా చర్చ జరుగుతున్నది. మరోవైపు గ్రోక్ వాడుతున్న పదజాలంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో ఏఐ చాట్ బాట్ వాడే భాషపై కొంత నియంత్రణ ఉండేదని, గ్రోక్ ఆ హద్దులను చెరిపేసిందని అంటున్నారు. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మరింత ఘాటు వ్యాఖ్యలు చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఏఐ చాట్ బాట్ ఇస్తున్న సమాధానాలు సోషల్ మీడియాలో బీజేపీ దూకుడుకు కళ్లెం వేస్తున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. గ్రోక్ సమాధానాలు కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలకు అస్త్రాలుగా మారాయని అంటున్నారు. ఎకువగా ఎక్స్‌లో వచ్చిన పోస్టులపై ఆధారపడి గ్రోక్ విశ్లేషణలు జరుపుతున్నదని, కాబట్టి పక్షపాతం చూపించే అవకాశం ఉన్నదని కొందరు బీజేపీ సానుభూతిపరులు వాదిస్తున్నారు. దీనికి ‘ఒకవేళ అదే నిజమైతే సోషల్ మీడియాలో బీజేపీ అనుకూల పోస్టులే ఎకువగా ఉంటాయి. కాబట్టి ఆ పార్టీకి, ఆ నేతలకు అనుకూలంగా మాత్రమే సమాధానాలు వస్తాయి కదా?’ అని కొందరు నెటిజెన్లు కౌంటర్ వేస్తున్నారు. అన్ని కోణాల్లో విశ్లేషించిన తర్వాతే సరైన సమాధానాలు ఇస్తోందని అభినందిస్తున్నారు.
దీంతో బీజేపీ మరింత ఇరుకున పడుతున్నట్టు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. దాదాపు దశాబ్దంన్నర కాలంగా దేశంలో సోషల్ మీడియాను శాసిస్తున్న బీజేపీకి గ్రోక్‌ను ఎలా ఎదురోవాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నట్టు చర్చ జరుగుతున్నది. దీంతో ఏకంగా ‘గ్రోక్ గో బ్యాక్’ ఉద్యమాన్ని ప్రారంభించిందని చెప్తున్నారు. ఏకంగా తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై బహిరంగంగా ‘గ్రోక్ గో బ్యాక్’ ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారని గుర్తు చేస్తున్నారు. మరోవైపు ఈ అంశంపై కేంద్రం ఎక్స్ నుంచి వివరణ కోరిందని ప్రచారం జరుగుతున్నది. త్వరలో చట్టపరమైన చర్యలు తీసుకుంటుందనే చర్చ జరుగుతున్నది.