సిలిగురి: మామిడి పండ్లు..! సాధారణంగా భారత్ సహా పలు ఆసియా దేశాల్లో మామిడి పండ్లను ఎక్కువగా సాగుచేస్తారు. ఈ మామిడి పండ్లు రకాన్ని బట్టి కిలో రూ.60 నుంచి రూ.300 వరకు ధర పలుకుతాయి. కానీ, తాజాగా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని సిలిగురి మార్కెట్లో 7వ ఎడిషన్ మ్యాంగో ఫెస్టివల్లో భాగంగా ప్రదర్శనకు ఉంచిన మియాజకి రకం మామిడి పండు మాత్రం ఏకంగా రూ.2.75 లక్షల ధర పలుకుతుందట. మరి ఈ కాస్ట్లీ మామిడి పండ్ల పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి..? ప్రత్యేకతలు ఏమిటి..? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
పశ్చిమబెంగాల్ రాష్ట్రం సిలిగురి జిల్లాలోని మటిగరా మాల్లో 7వ ఎడిషన్ మ్యాంగో ఫెస్టివల్ జరుగుతున్నది. మొడెల్లా కేర్ టేకర్ సెంటర్ & స్కూల్ (MCCS) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మూడు రోజుల (జూన్ 9 నుంచి 11 వరకు) మ్యాంగో ఫెస్టివల్లో మొత్తం 262 రకాల మామిడిపండ్లను ప్రదర్శనకు ఉంచారు. వాటిలో అత్యంత అరుదైన మియాజకీ రకం మామిడిపండ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని బిర్భూమ్ జిల్లాకు చెందిన షౌకత్ అలీ అనే రైతు కూడా ఈ మ్యాంగో ఫెస్టివల్లో పాల్గొన్నాడు. ఆయన అత్యంత ఖరీదైన 10 మియాజకీ రకం మామిడి పండ్లను ప్రదర్శనకు ఉంచాడు. ఈ పండ్లు కిలో రూ.2.75 లక్షల ధర పలుకుతాయని ఆయన చెప్పాడు. దాంతో మ్యాంగో ఫెస్టివల్ ఈ మామిడి పండ్లను కొనే సత్తా లేకపోయినా చాలామంది వాటిని చూసేందుకు మాత్రం ఎగబడుతున్నారు.
ఈ మామడి పండ్లు ముందుగా ఎక్కడ ఉండేవి..?
ఈ మియాజకీ రకం మామిడి పండ్లు ప్రస్తుతం భారత్, బంగ్లాదేశ్, థాయిలాండ్, ఫిలిప్పీన్స్ దేశాల్లో లభ్యమవుతున్నాయి. ముందుగా జపాన్లోని మియాజకీ నగరంలో ఈ రకం మామిడి చెట్ల ఉనికి బయటపడింది. 1970ల ఆఖర్లో, 1980ల మొదట్లో ఈ మియాజకీ రకం చెట్లు పెరుగడం మొదలైంది. ఆ తర్వాత ఇతర ప్రాంతాలకు విస్తరించాయి. భారత్లోని బిర్భూమ్ జిల్లాలో దుబ్రాజ్పూర్ మసీదు సమీపంలో షౌకత్ అలీ అనే రైతుకు మియాజకీ రకం మామిడి చెట్టు ఉంది. అదేవిధంగా మధ్యప్రదేశ్లోని జబల్పూర్ నగరంలోగల ఓ మామిడి తోటలో రైతు దంపతులు రెండు మియాజకీ చెట్లు పెంచుతున్నారు. రైల్లో కలిసిన ఓ వ్యక్తి తమకు ఈ మొక్కలను ఇచ్చినట్టు వారు చెప్పారు.
ఈ మామిడి పండ్ల ప్రత్యేకత ఏమిటి..?
జపాన్లోని మియాజకీ నగరంలో ఈ రకం పండ్లు మొదట కనిపించాయి కాబట్టి ఈ మామిడి పండ్లకు మియాజకీ అనే పేరు వచ్చింది. ఇవి చూడటానికి పర్పుల్ రంగులో ఆకర్షణీయంగా ఉంటాయి. పూర్తిగా పక్వానికి వచ్చినప్పుడు లేత ఎరుపు రంగులో కనిపిస్తాయి. జపాన్లో ఈ పండును ‘తైయో నొ తమాగో’ అని అంటారు. జపనీస్ భాషలో తైయో నొ తమాగో అంటే తెలుగులో ‘సూర్యుడి గుడ్డు’ అని అర్థం. ఈ మామిడి పండ్లు పరిమాణంలో సాధారణ మామిడి పండ్ల కంటే పెద్దగా ఉంటాయి. ఒక్కో పండు 350 గ్రాముల నుంచి 900 గ్రాముల వరకు బరువు పెరుగుతాయి. వీటిలో తీపి శాతం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఏటా ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య కాలంలో ఈ పండ్లు కోతకు వస్తాయి.
Siliguri, West Bengal | World’s most expensive mango ‘Miyazaki’ priced at around Rs 2.75 lakh per kg in International market showcased in Siliguri’s three days long 7th edition of the Mango Festival.
The festival kicked off on June 9 at a mall in Siliguri organised by Modella… pic.twitter.com/GweBPkXons
— ANI (@ANI) June 10, 2023