న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రోడ్డును నిర్మించి భారత్ రికార్డు సృష్టించింది. మిగ్ లా పాస్ వెంబడి 19,400 అడుగుల ఎత్తులో ఈ రోడ్డును బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) నిర్మించింది. దీనిపై వాహనాలు రాకపోకలు సాగించవచ్చు. లికరు-మిగ్ లా-ఫుక్చే అలైన్మెంట్లో భాగమైన ఈ రోడ్డు హాన్లే రీజియన్‌ను ఫుక్చే గ్రామంతో అనుసంధానం చేస్తుంది. ఇది వాస్తవాధీన రేఖకు సమీపంలో ఉంది. ప్రాజెక్టు హిమాంక్ క్రింద దీనిని నిర్మించారు. ఈ రోడ్డు పూర్తయిన సందర్భంగా జాతీయ పతాకాన్ని, బీఆర్ఓ జెండాను ఎగురవేశారు. నేపాల్‌లోని ఎవరెస్ట్ శిఖరం సౌత్ బేస్ క్యాంప్ (17,598అడుగులు), టిబెట్‌లోని నార్త్ బేస్ క్యాంప్ (16,900 అడుగులు) కన్నా మిగ్ లా పాస్ (19,400 అడుగులు) ఎత్తయినది. ఉమ్లింగ్ లా (19,024 అడుగులు) రికార్డును మిగ్ లా పాస్ రోడ్డు చెరిపేసింది. ఉమ్లింగ్ లాకు గతంలో గిన్నిస్ ప్రపంచ రికార్డు లభించింది.