Palatial House | బెంగళూరు : సిమెంట్‌ను వాడకుండా ఇల్లు కట్టడమా? అది కూడా రాళ్లతో! కంటెంట్ క్రియేటర్ ప్రియం సారస్వత్ వెలుగులోకి తెచ్చిన ఈ ఇల్లు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ ఇంటి వీడియో టూర్లో ఇంటి యజమానితోపాటు, దీని ఆర్కిటెక్ట్ కూడా ఆసక్తికర విషయాలను చెప్పారు. ఇంటి యజమాని మాట్లాడుతూ, ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి సిమెంట్ రహిత రాతి ఇల్లు అని తెలిపారు. స్థిరంగా ఉండటానికి మాత్రమే కాకుండా 1,000 సంవత్సరాలకుపైగా చెక్కు చెదరకుండా ఉండేలా దీనిని నిర్మించినట్లు చెప్పారు.
అత్యంత జాగ్రత్తగా ఎంపిక చేసిన రాతిని వినియోగించామన్నారు. గ్రే గ్రానైట్, శాండ్‌స్టోన్ వంటివాటిని వాడినట్లు తెలిపారు. వీటిని సంప్రదాయ ఇంటర్‌లాకింగ్ టెక్నిక్స్‌తో ఫిట్ చేశామన్నారు. సిమెంట్, జింక, బంక, బ్లాస్టింగ్ వంటివాటిని వినియోగించలేదని చెప్పారు. కేవలం రాళ్లు, నైపుణ్యం, కచ్చితత్వాలను మాత్రమే వినియోగించామని తెలిపారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు అబ్బురపడుతున్నారు. వెయ్యేళ్లు చెక్కు చెదరకుండా నిలిచే ఇంటి గురించి తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు. ప్రాచీన భారతీయ వాస్తు కళలో ఇటువంటి చిట్కాలనే ఉపయోగించేవారని గుర్తు చేస్తున్నారు. ఇది ఆధునిక పునరుజ్జీవనమని హర్షం వ్యక్తం చేస్తున్నారు.