న్యూఢిల్లీ, మే 28 : రాబోయే ఐదేండ్లలో ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు 1.9 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగవచ్చునని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) నివేదిక హెచ్చరించింది. ఉష్ణోగ్రతల పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్ దాటకుండా కట్టడి చేయాలన్నది ‘పారిస్ ఒప్పందం’ లక్ష్యం. ఒకవేళ సగటు ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీలు దాటితే తీవ్రమైన వాతావరణ మార్పులు, అకాల వర్షాలు, వరదలు, కరువు, సముద్ర మట్టాలు పెరగడానికి దారితీస్తుంది. డబ్ల్యూఎంవో తాజా నివేదిక ప్రకారం, రాబోయే ఐదేండ్లలో ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు రికార్డ్‌స్థాయిలో లేదా దానికి సమీపంలో ఉండే అవకాశముంది.
2026 నుండి 2030 వరకు అంచనా వేసిన భూ ఉపరితల ఉష్ణోగ్రతలు 1850-1900 (పారిశ్రామిక విప్లవానికి ముందు) సగటు కంటే 1.3 నుండి 1.9 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. 2024 అత్యంత వేడి సంవత్సరంగా రికార్డ్ నెలకొల్పింది. సగటు ఉష్ణోగ్రతల్లో పెరుగుదల 1.55 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. తాజా అంచనాల ప్రకారం రాబోయే ఐదేండ్లలో 1.5 డిగ్రీల సెల్సియస్ పరిమితిని దాటే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. 2026-30 మధ్య ఏదో ఒక సంవత్సరం అత్యంత వేడి సంవత్సరంగా 2024ను అధిగమించే అవకాశం 86 శాతం ఉంది.