న్యూఢిల్లీ/సూరత్/తిరువనంతపురం, మార్చి 20 : వలస బతుకులపై గ్యాస్ పిడుగు పడింది. దేశ వ్యాప్తంగా ఎల్పీజీ సంక్షోభం వేలాది మంది ఉపాధిని పోగొట్టింది. దీంతో వేరే గత్యంతరం లేక వలస కార్మికులు స్వస్థలం బాట పడుతున్నారు. దేశమంతటా ఈ పరిస్థితి నెలకొంది. దీంతో పలు రాష్ర్టాల్లోని రైళ్లు వలస కార్మికులతో కిక్కిరిసిపోతున్నాయి. పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం తమ ఉపాధిని తాకడంతో గుజరాత్‌లోని సూరత్‌లో వస్త్ర, ఇతర సంస్థల్లో పనిచేసే వేలాది వలస కార్మికులు తమ రాష్ర్టాలకు ప్రయాణం కావడం కన్పించింది. సూరత్‌లోని ఉదాన రైల్వే స్టేషన్లో వందలాది కార్మికులు తమ రాష్ర్టాలకు వెళ్లేందుకు రైళ్ల బోగీల వద్ద బారులు తీరారు.
దేశ వ్యాప్తంగా గ్యాస్ కొరత తీవ్రంగా వేధిస్తున్నా, ఇంత సంక్షోభం ఏర్పడినా గ్యాస్‌కు ఎలాంటి కొరత లేదంటూ మోదీ ప్రభుత్వం బూటకపు ప్రకటనలు చేస్తుండటం పట్ల పలువురు కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మోదీజీ మీ మాయ మాటలు ఆపండి.. గ్యాస్ కొరత లేకపోతే ఎందుకు ఉపాధి కోల్పోయాం.. ఎందుకు పస్తులుంటున్నాం.. ఎందుకు సొంత ఊళ్లకు వెళ్లిపోతున్నాం?’ అని సూరత్ రైల్వే స్టేషన్లో పలువురు యువ వలస కార్మికులు ఆగ్రహంతో ప్రశ్నించారు.
కేజీ గ్యాస్‌ను రూ.500కు అమ్ముతున్నారని, దానిని కొనే స్తోమత తమకు లేదని, ఇప్పటికే కొన్ని రోజులుగా తిండిలేక పస్తులు ఉన్నామని, ఇక్కడ ఉండి ఆకలితో పోయే కంటే సొంత ఊర్లో చావడం మంచిదని అక్కడకు పోతున్నామని వివిధ హోటళ్లు, రెస్టారెంట్లు, వీధి ఆహారబండ్లపై పనిచేసే పలువురు వలస కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘మా యజమానులు కూడా దుకాణాలను మూసేశారు. తిరిగి మామూలు పరిస్థితులు ఏర్పడి దుకాణాలు తెరచినప్పుడు మమ్మల్ని పిలుస్తామని చెప్పి చేతులు దులిపేసుకున్నారు. చేతిలో పైసా లేదు. సహాయం చేసే వారు ఎవరూ లేరు’ అని సచిన్ అనే కార్మికుడు కన్నీటి పర్యంత మయ్యాడు. ‘15 రోజులుగా గ్యాస్ వస్తదని ఎదురు చూశాం. రాలేదు. సర్కారేమో గ్యాస్ కొరత లేదని చెబుతున్నది. ఏజెన్సీ వారేమో ఇప్పుడు ఇవ్వలేమని అంటున్నారు. చిన్న సిలిండర్ కూడా ఇవ్వమంటున్నారు.. అందుకే సొంతూరుకు పోతున్నాం’ అని సీమాదేవి అనే మహిళ తెలిపింది.
గ్యాస్ కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కేరళలోని హోటల్ పరిశ్రమకు ఇప్పుడు కార్మికుల రూపంలో మరో ముప్పు ఏర్పడనుంది. ఇక్కడి హోటల్ పరిశ్రమలో పనిచేస్తున్న వారిలో అధిక శాతం వలస కార్మికులే. అయితే హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్నచిన్న ఆహార సంస్థలు, స్వీట్స్టాళ్లు మూతపడటంతో ఇక్కడ పనిచేస్తున్న కార్మికులు ఉపాధి కోల్పోయి తమ సొంత ఊళ్లకు ప్రయాణమవుతున్నారు. గ్యాస్ కొరతతో రాష్ట్రంలోని 1200 ఆహార సంస్థలు మూతపడ్డాయి.