న్యూఢిల్లీ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) కింద పనిదినాలు రాన్రానూ తగ్గిపోతున్నాయి. సామాజిక కార్యకర్తలు, విద్యావంతులతో కూడిన లిబ్టెక్ ఇండియా విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, 2023-24 ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కాలంలో 178.1 కోట్ల పనిదినాలు నమోదయ్యాయి. 2024-25లో ఇదే కాలంలో 25.6 శాతం తగ్గి, 150.1 కోట్లు మాత్రమే నమోదయ్యాయి.
ఈ ఏడాది ఇదే కాలంలో 11.7 శాతం తగ్గి, 132.5 కోట్ల పనిదినాలు మాత్రమే నమోదయ్యాయి. 2024-25తో పోల్చుకుంటే, 2025-26లో కేవలం ఎనిమిది రాష్ర్టాల్లో మాత్రమే పనిదినాలు పెరిగాయి. 11 రాష్ర్టాల్లో తగ్గిపోయాయి. పశ్చిమ బెంగాల్లో పనిదినాలు రికార్డు కాలేదు. ఉత్తరాఖండ్ (54.3 శాతం), తెలంగాణ (47.6 శాతం)లలో 2025-26లో పనిదినాలు భారీగా తగ్గిపోయాయి. జార్ఖండ్ (56.4 శాతం), మధ్యప్రదేశ్ (30.5 శాతం)లలో పెరిగాయి.
భారీగా కూలీల తొలగింపు: లిబ్టెక్ సీనియర్ రిసెర్చర్ ముక్కెర రాహుల్ మాట్లాడుతూ, గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఎక్కువ మందిని తొలగించారని, తక్కువ మందిని చేర్చారని తెలిపారు. ఉపాధి హామీ చట్టం కింద కూలీలకు ఈ-కేవైసీ తప్పనిసరి అని ప్రభుత్వం ప్రకటించడంతో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని లిబ్టెక్ ఇండియా కార్యకర్తలు చెప్పారు.