పాట్నా: ఎన్నికల గడువు సమీపిస్తున్న కొద్దీ బీహార్‌లో (Bihar Elections) రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కూటముల మధ్య సీట్ల పంపకాలు పూర్తికాకముందే ముఖ్యమంత్రి అభ్యర్థి (Chief Ministerial Face) ఎవరనే విషయమై విస్తృతంగా చర్చ నడుస్తున్నది. అధికార ఎన్డీయే కూటమి మరోసారి సీఎంగా నితీశ్‌నే ప్రకటిస్తుందా లేదా బీజేపీ ఈసారి ఆ పదవిని తీసుకుంటుందా అని ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు విపక్ష మహా కూటమిలో (మహాఘట్బంధన్) ముఖ్యమంత్రి అభ్యర్థిపై ఒక స్పష్టత వచ్చినట్లుంది. ఎందుకంటే ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలోనే ఆర్జేడీ నేత, రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav).. ముఖ్యమంత్రి క్యాండిడేట్ తానేనని స్వయంగా ప్రకటించుకున్నారు. అయితే దీనిపై రాహుల్ గానీ, కూటమి గానీ ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మంతి అభ్యర్థిని ప్రకటించకుండా తమ కూటమి ఎన్నికల్లో పోటీచేయదని తేజస్వీ స్పష్టం చేశారు. ఒకటి రెండు రోజులు ఆలస్యమైనా సీఎం ఫేస్‌ను ప్రకటిస్తామని చెప్పారు.
‘తమదేమైనా బీజేపీయా?. ముఖ్యమంత్రి అభ్యర్థి లేకుండా ఉండటానికి. ఎట్టిపరిస్థితుల్లోనూ సీఎం అభ్యర్థి లేకుండా ఎన్నికలకు వెళ్లేది లేదు. కూటమిలో సీట్ల పంపకాలు పూర్తి అయిన తర్వాత చర్చకు వచ్చే విషయం అదే. ఐదు పది రోజులు ఆలస్యం అవుతుంది అంతే. పెద్ద తేడా ఏమీ ఉండదు. ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తాం’ అని ఆర్జేడీ నేత చెప్పారు. అయితే గత నెల 30న ఓటర్ అధికార్ యాత్ర సందర్భంగా ఆరా జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ సభలో తేజస్వీ మాట్లాడుతూ మహాఘట్బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తానేనంటూ ప్రకటించుకున్నారు. అదే వేదికపై రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా ఉన్నారు. అయితే ఈ విషయమై రాహుల్ గాంధీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
కాగా, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అన్ని స్థానాల్లోనూ పోటీచేస్తుందని ఆర్జేడీ నేత ప్రకటించిన విషయం తెలిసిందే. మహా కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల పంపకంలో ప్రతిష్టంభన ఏర్పడిన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. తమ పార్టీ పోటీ చేయబోతున్న కొన్ని నియోజకవర్గాల పేర్లను కూడా ఆయన చెప్పారు. వీటిలో ఒకదానిలో ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు. సీట్ల పంపకాల చర్చల్లో మిత్ర పక్షాలపై ఒత్తిడి పెంచడం కోసమే ఆయన ఈ విధంగా ప్రకటించారని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ కూటమిలో ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు, వీఐపీ, జేఎంఎం, ఎల్జేపీ (పరాస్ వర్గం) ఉన్నాయి. కాంగ్రెస్ ఎక్కువ స్థానాలను ఆశిస్తున్నట్లు సమాచారం.