న్యూఢిల్లీ: ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్ సమావేశం (INDIA bloc meet) జూన్ 1న జరుగనున్నది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగే ఈ మీటింగ్‌లో లోక్‌సభ ఎన్నికలు, జూన్ 4న ఫలితాలు, కూటమి భవిష్యత్తుపై చర్చించనున్నారు. అయితే ఈ సమావేశానికి తాము హాజరు కావడం లేదని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) స్పష్టం చేసింది. ఏడో దశ పోలింగ్ దీనికి కారణమని పేర్కొంది. ‘ఏడో దశలో మాకు ముఖ్యమైన ఎన్నికలు ఉన్నాయి. బెంగాల్లో తొమ్మిది స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. కోల్‌కతా, గ్రేటర్ కోల్‌కతాలోని అన్ని స్థానాలకు ఆ రోజున ఓటింగ్ ఉంది. టీఎంసీకి ఇది పెద్ద ఎన్నికల రోజు. అలాగే ఉత్తర ప్రదేశ్, బీహార్, పంజాబ్‌లో కూడా పోలింగ్ జరుగుతుంది. దీంతో ఢిల్లీ వెళ్లడం ఆచరణాత్మకం కాదు’ అని టీఎంసీ నేత అన్నారు.
కాగా, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ఆ రాష్ట్రంలో మాత్రం ‘ఇండియా’ బ్లాక్‌తో పొత్తుకు దూరంగా ఉంది. అయితే ఈ కూటమిలో తాము భాగమని మమతా బెనర్జీ తెలిపారు. ఢిల్లీ స్థాయిలో మాత్రమే ‘ఇండియా’ బ్లాక్‌కు మద్దతిస్తామని స్పష్టం చేశారు.